“బాహుబలి, భజరంగీ భాయ్ జాన్” లాంటి బ్లాక్ బస్టర్ చిత్రాలకు కథను సమకూర్చిన అపర మేధావి, రాజమౌళి తండ్రి విజయేంద్రప్రసాద్ దర్శకత్వం వహించిన చిత్రం “శ్రీవల్లి”. “బాహుబలి పార్ట్ 1” రిలీజయ్యాక స్టార్ట్ అయిన ఈ ప్రొజెక్ట్ “బాహుబలి 2” విడుదలైన ఆరు నెలలకు అతికష్టం మీద విడుదలైన “శ్రీవల్లి”పై కాస్త మంచి అంచనాలే ఉన్నాయి. మరి గొప్ప రచయితగా పేరు సంపాదించుకొన్న విజయేంద్రప్రసాద్ దర్శకుడిగా ఏమేరకు ఆకట్టుకున్నాడో చూద్దాం..!!
కథ : ఈ సినిమా కథను కథగా చెప్పాలంటే ఒక విశ్లేషకుడిగా నాకు ఫిజిక్స్, కెమిస్ట్రీ లతోపాటు సైన్స్ కు కూడా అందని కొన్ని సబ్జెక్ట్స్ వచ్చి ఉండాలి. అయితే.. మరీ వివరంగా చెప్పడానికి నాకే సరిగా అర్ధం కానీ కథను.. కాస్త సింపుల్ గా చెప్పడానికి ప్రయత్నిస్తాను. వల్లీ (నేహా హెంగే) ఓ సైన్స్ స్టూడెంట్. చిన్నప్పుడే తల్లిని, వయసుకొచ్చాక తండ్రిని పోగొట్టుకొన్న వల్లి.. తన చిన్ననాటి స్నేహితుడైన గౌతమ్ (రజత్)తో కలిసి చదువుకుంటూనే.. తన తమ్ముడ్ని, తండ్రి చనిపోయే ముందు అప్పగించిన ఓ ట్రస్ట్ బాధ్యతలను సక్రమంగా నిర్వర్తిస్తుంటుంది. తన ప్రొఫెసర్ కోసమని “బ్రెయిన్ వేవ్ రికార్డింగ్” ఎక్స్ పెరిమెంట్ కోసం “నగ్నంగా” ఒక ప్రక్రియలో పాల్గొంటుంది. ఆ ప్రయోగం సక్సెస్ అయినా.. అప్పట్నుంచి వల్లీ చిత్రవిచిత్రమైన కలలు కంటుంటుంది. తాను పూర్వ జన్మలో లైలా అని ఊహించుకోవడం, ఎవరితోనో రాత్రంతా శృంగారంలో పాల్గొనడం వంటివి తనకు తెలియకుండానే చేసేస్తుంటుంది. కానీ.. తెల్లారేసరికి అదంతా ఎలా జరిగిందో తెలియక కన్ఫ్యూజన్ లో కాలం నెట్టుకొచ్చేస్తుంటుంది.
కట్ చేస్తే.. అసలు వల్లీ పీడకలలు, విచిత్రమైన బిహేవియర్ కు కారణం తాను ఎంతగానో ప్రేమిస్తున్న తన చిన్ననాటి స్నేహితుడు గౌతమ్ అని ప్రొఫెసర్ ద్వారా తెలుసుకొంటుంది. అసలు తాను చిన్నప్పట్నుంచి ప్రాణంగా ప్రేమించిన శ్రీవల్లికి గౌతమ్ ఎందుకు హాని చేయాలనుకొంటాడు? నిజం తెలుసుకొన్న శ్రీవల్లి తనకు తన తమ్ముడికి గౌతమ్ కారణంగా పొంచి ఉన్న ప్రాణ హాని నుండి ఎలా బయటపడింది? వంటి విచిత్రమైన ప్రశ్నలకు, అర్ధం అనే పదానికి మీనింగ్ అనేది లేకుండా అపర మేధావి విజయేంద్రప్రసాద్ తన బుర్రను విపరీతంగా వినియోగించి ప్రేక్షకులకు ఏమాత్రం అర్ధం కాకుండా చెప్పిన తిక్క సమాధానాల సమాహారమే “శ్రీవల్లి” చిత్రం.
నటీనటుల పనితీరు : మామూలుగానే మన తెలుగు సినిమా హీరోయిన్స్ కు సినిమాలో అందంగా కనిపించడం మినహా పెద్దగా పని ఉండదు. కానీ.. “శ్రీవల్లి” సినిమాలో హీరోయిన్ గా నటించిన నేహా హెంగే మాత్రం రొమాన్స్ చేసింది, నగ్నంగా నటించింది, రోడ్ల మీద పరిగెట్టింది, ఫైట్లు చేసింది.. అబ్బో చాలా చేసిందిలెండి. కానీ.. ఏం లాభం నటించడం మాత్రం మర్చిపోయింది. నటనలో ఉన్న అన్ని రసాల్లోకెల్లా అమ్మడు అద్భుతంగా పండించింది కేవలం శృంగార రసం మాత్రమే. ఆ రసాన్ని మాత్రం లీటర్ల కొద్దీ పండించి నేహా. హీరోనా విలనా అర్ధం కానీ రజత్ కృష్ణ నటన అటు జూనియర్ ఆర్టిస్ట్ కి ఎక్కువ, సైడ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ కి తక్కువ అన్నట్లుగా ఉంటుంది. వీళ్ళిద్దరూ కాకుండా సినిమాలో ఇంకొక అద్భుతమైన నటుడున్నాడు.. ఆయన పేరు తెలియదు కానీ.. ప్రొఫెసర్ గా అతడి నటన గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే.
సాంకేతికవర్గం పనితీరు : ఎం.ఎం.శ్రీలేఖ అందించిన సంగీతం విడిగా వింటే ఎలా ఉంటుందో తెలియదు కానీ.. ఒక్క జోల పాట మినహా పాటలన్నీ థియేటర్ లో కళ్ళు మూసుకొని వినడానికి కూడా ఓపిక చాలలేదు. రాజశేఖర్ సినిమాటోగ్రఫీ కంటే గ్రాఫిక్సే సినిమాలో ఎక్కువగా కనిపించడంతో.. ఆయన పనితనం గురించి ఎక్కువగా మాట్లాడుకొనే లేదా విశ్లేషించుకొనే అవకాశాన్ని విజయేంద్రప్రసాద్ ఇవ్వలేదు. సినిమాకి ఎడిటర్ గా వర్క్ చేసిన గొప్ప ఓపిక ఉన్న టెక్నీషియల్ ఎవరన్నది తెలియదు కానీ.. ఆయన కనిపిస్తే దండేసి దండం పెట్టాలన్న కోరిక కలిగింది. అందుకు కారణం ఆయన ఎడిటింగ్ వర్క్ బాలేదని కాదు.. సినిమాని ఆయన అర్ధం చేసుకొని ఆడియన్స్ కి అర్ధమవ్వడానికి ప్రయత్నిస్తూ ఎడిటింగ్ చేసినందుకు.
ఇప్పుడు మన దర్శకధీరుడు, అపర మేధావి, కృషీవలుడు విజయేంద్రప్రసాద్ గురించి చెప్పుకోవాలి.. అప్పుడెప్పుడో 1980లో వచ్చిన “మైనారిటీ రిపోర్ట్” అనే ఆంగ్ల చిత్రంలోని “బ్రాయిన్ వేవ్” అనే కాన్సెప్ట్ ను బేస్ చేసుకొని కథ రాసుకొన్న విజయేంద్రప్రసాద్, ఆ కథను నడిపించడం కోసం రాసుకొన్న కథనం ఏదైతే ఉందో.. “అబ్బో.. అటు ఏడు తరాలు, ఇటు ఏడు తరాలు” చూసినా అంతకుమించిన, ప్రేక్షకుల్ని హింసించిన స్క్రీన్ ప్లే తెలుగు చలన చిత్ర చరిత్రలో కనిపించదు. హీరోయిన్ ని రేప్ చేయాలన్న ఏకైక ధ్యేయంతో ఒక అమ్మాయి అమెరికా నుండి ఫాలో అవుతూ ఇండియా రావడం ఏంటో?, బ్రెయిస్ వేవ్ ని రికార్డ్ చేసి వాళ్ళ ఆలోచనలను ఎవరుపడితే వారు కంట్రోల్ చేయడం ఏంటో? హీరోయిన్ పూర్వ జన్మలో లైలా అని ఊహించుకోవడం, ఎవరితోనో శృంగారంలో పాల్గొని సంతృప్తి పొందడం ఏమిటో? ఇలా చెప్పుకొంటూ పోతే.. ఎన్నో అర్ధం కానీ లాజిక్కులు.. ఈ ప్రశ్నలకు సమాధానాలు కేవలం కథ-కథనం రాసుకొన్న విజయేంద్రప్రసాద్ గారికి మాత్రమే తెలియాలి. “టెంపర్” తరహాలో ఆయన “శ్రీవల్లి” సినిమా “కథ-స్క్రీన్ ప్లే-మాటలు-దర్శకత్వం” గురించి ఒక పుస్తకం రాస్తే.. అర్జెంటుగా ఆ పుస్తకాన్ని చదివి అసలాయన ఏం చెప్పదలుచుకున్నాడో చదివి అర్ధం చేసుకోవాలని ఆశగా ఉంది. ఇంతకుమించి ఆయన దర్శకత్వ ప్రతిభ గురించి ఏం చెప్పాలో అర్ధం కాక… ఓపిక లేక ఇంతటితో ఆపేస్తున్నా.
విశ్లేషణ : మన 80 ఏళ్ల తెలుగు సినిమా చరిత్రలో “అత్యంత నీచమైన సినిమాలు” అనే జాబితా గనుక తయారు చేస్తే.. నిర్మొహమాటంగా టాప్ 5 పొజిషన్ లో మొదటి స్థానం కోసం పోటీ పడేందుకు అన్ని రకాల అర్హతలు ఉన్న ఏకైక చిత్రం “శ్రీవల్లి”. సో, ప్రియమైన ప్రేక్షకులారా.. తెలుగు సినిమా అభిమానులారా.. “శ్రీవల్లి” సినిమాకు మాత్రమే కాదు సదరు సినిమా ఆడుతున్న థియేటర్లకు కూడా ఎంత దూరంగా ఉంటే అంత మంచిది.
రేటింగ్ : 0/5