కరోనా వచ్చాక మనిషి ఏం అనారోగ్యం చేస్తుంది, దాని వల్ల ఇబ్బందులేంటి అనేది పక్కనపెడితే.. ఆ మహమ్మారి వల్ల ఏదో అయిపోతుంది అనే భయంతో ఇబ్బందిపడిన వాళ్లే ఎక్కువమంది అంటారు. చాలామంది మానసిక వైద్యులు ఈ విషయాన్ని స్పష్టంగా చెప్పారు కూడా. కరోనా ప్రభావం కంటే.. కరోనా భయంతోనే ఎక్కువమంది ఇబ్బందులు పడ్డారని తెలిపారు. దీనికి టాలీవుడ్‌లో కనిపించే ఉదాహరణల్లో ప్రముఖ క్యారెక్టర్ అర్టిస్ట్ అజయ్ ఘోష్ ఒకరు. తనదైన మాడ్యులేషన్, స్క్రీన్‌ప్రజెన్స్‌తో అదరగొట్టే అజయ్ ఘోష్ కరోనాతో చాలా ఇబ్బందులు పడ్డారు. ఆ సమయంలో దర్శకుడు సుకుమార్ తనకు ఎంతో బాసటగా నిలిచారని తెలిపారు.
అజయ్ ఘోష్ నటన బాగా నచ్చి ‘రంగస్థలం’ మంచి పాత్ర ఇచ్చారు సుకుమార్. ఆ తర్వాత ‘పుష్ప’లో చేసిన కొండారెడ్డి పాత్ర వెతుక్కుంటూ వచ్చింది. అయితే ఆ పాత్ర చేయడానికి తొలుత అజయ్ ఘోష్ వెనకాడారట. అదేదో పాత్ర అంటే భయానికి కాదు. ఆ సమయంలో కరోనా పీక్ స్టేజీలో ఉంది. అజయ్ కూడా కరోనా బారిన పడ్డారు. దీంతో బయటకు రావడానికి చాలా భయపడ్డారు. మానసికంగా చాలా కుంగిపోయారు. తెల్లవారితే చనిపోతా అని రోజూ అనుకునేవారట. ఆ సమయంలో ‘పుష్ప’ అవకాశం వచ్చిందట.
కరోనా పరిస్థితుల భయం వల్ల కొండా రెడ్డి పాత్రను చేయనని సుకుమార్‌తో అజయ్ ఘోష్ చెప్పారట. అయితే సుకుమార్ అజయ్‌లో భయాన్ని పోగొట్టారట. సినిమా వద్దంటే వద్దు అని అజయ్ ఘోష్ పట్టుబడితే.. చేయాల్సిందే, చేసి తీరతావ్ అని సుకుమార్ అనేవారట. దాని కోసం వద్దంటున్నా లుక్ టెస్ట్ చేసి, ఆ తర్వాత సెట్స్‌కి వచ్చాక కూడా అజయ్ ‘నేనెళ్లిపోతా.. నాకీ షూటింగ్ వద్దు’ అని భయపడ్డారట.
అప్పుడు అజయ్‌లో భయం పోగొట్టడానికి సుకుమార్.. ఏకంగా డ్యాన్స్‌లే వేశారట. ‘అజయ్ చూడు ‘అమ్మోరు తల్లి’ సినిమాలో నువ్విలాగే డ్యాన్స్ వేశావు కదా’ అంటూ అందరి ముందు డ్యాన్స్‌లు వేసి మరీ మనోధైర్యం నింపారట. ఆయన అలా చెప్పబట్టే నేను సినిమా చేశా అని అజయ్ ఘోష్ తెలిపారు.