గతకొద్ది రోజులుగా వరుస మరణాలు చిత్ర పరిశ్రమను కుదిపేస్తున్నాయి.. టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్, శాండల్ వుడ్, మాలీవుడ్ ఇండస్ట్రీలకు చెందిన పలువురు సినీ ప్రముఖులు పలు కారణాల వల్ల మృతిచెందారు. దీంతో, ఏ క్షణాన ఎలాంటి దుర్వార్త వినాల్సి వస్తుందోనని కంగారు పడుతున్నారు సినిమా పరిశ్రమ వర్గాలవారు.. ఇక సెలబ్రెటీలు వరుసగా కన్ను మూయడంతో వారి కుటుంబ సభ్యులే కాదు.. అభిమానులు సైతం శోక సంద్రంలో మునిగి పోతున్నారు.. బాలీవుడ్ సీనియర్ యాక్టర్ విక్రమ్ గోఖలే, మలయాళ పరిశ్రమకు చెందిన రచయితలు బి.హరికుమార్, సతీష్ బాబు మరణించారు.
నిన్న (డిసెంబర్ 1) ప్రముఖ తమిళ నిర్మాత కె. మురళీ ధరన్ కన్నుమూశారనే వార్త ఇంకా వైరల్ అవుతుండగానే.. ఇప్పుడు సీనియర్ నటి మరణించారనే వార్త షాక్‌కి గురి చేసింది.. ప్రముఖ ఒరియా (ఒడియా) నటి ఝరానా దాస్ ఇకలేరు. గత కొద్ది రోజులుగా వృద్దాప్య సంబంధింత సమస్యలతో బాధపడుతున్న ఆమె గురువారం (డిసెంబర్ 1) రాత్రి కన్నుమూశారు. ఝారానా వయసు 77 సంవత్సరాలు.. కటక్‌లోని తన స్వగృహంలో ఆమె తుది శ్వాస విడిచారు. ఝరానా దాస్ మృతిపై పలువురు సినీ ప్రముఖులు సామాజిక మాధ్యమాల ద్వారా సంతాపం తెలియజేస్తున్నారు.
ఝరానా తన నటనతో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నారు. ఆమె 1945లో జన్మించారు. తన 15వ ఏట, 1960లో సినిమా కెరీర్ మొదలుపెట్టారు. ఝరానా బాల నటిగా కూడా పలు సినిమాల్లో నటించారు. ‘శ్రీ జగన్నాథ్, నారీ, అదినామేగా, హిసబ్‌నికాస్, పూజాఫులా, అమదబాతా, అభినేత్రి, మలజన్హా, హీరా నెల్లా’ వంటి చిత్రాలతో నటిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఆల్ ఇండియా రేడియోలో అనౌన్సర్‌గా కూడా పనిచేశారు. అంతేకాదు.. అదే ఆల్ ఇండియా రేడియాలో అసిస్టెంట్ స్టేషన్ డైరెక్టర్ ఆఫ్ దూరదర్శన్‌గా కూడా పనిచేశారు.
మాజీ ఒరిస్సా ముఖ్యమంత్రి హరేకృష్ణ మహ్‌తాబ్ మీద ఆమె ఓ బయోగ్రాఫికల్ డాక్యుమెంటరీని రూపొందించారు. దీనికి ఝరానానే దర్శకత్వం వహించడం విశేషం.. ఈ డాక్యుమెంటరీకి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఆమె ఉత్తమ నటనకు గానూ స్టేట్ గవర్నమెంట్ అవార్డు సైతం అందుకున్నారు. ఇక, ఝరానా మృతిపై ఒరిస్సా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ సంతాపం వ్యక్తం చేశారు. ఆమె కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.ఝరానా మృతిపై కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ కూడా సంతాపం వ్యక్తం చేశారు.