తెలుగు సినిమాలో ఇటీవల కాలంలో చాలా మార్పులు జరుగుతున్నాయి. పాన్ ఇండియా ఫీవర్ ఎక్కువగా కనిపిస్తోంది. మన హీరోలు మాస్ సినిమాలు చేస్తూనే, ప్రయోగాలు చేయడానికి ముందుకొస్తున్నారు. కొత్త కొత్త కథలు కనిపిస్తున్నాయి. అయితే టాలీవుడ్‌లో కథలు చెప్పడం మరచిపోయాం అంటున్నారు యువ దర్శకుడు కరుణ కుమార్. ‘పలాస’ రూపంలో తొలి సినిమాతోనే హిట్ కొట్టిన కరుణ కుమార్… ఇప్పుడు ‘శ్రీదేవి సోడా సెంటర్’ను తీసుకొస్తున్నాడు. ఈ సినిమా విడుదల నేపథ్యంలో ఆయన మాట్లాడారు.
‘‘పదేళ్లకుగా టాలీవుడ్‌లో మనం కథలు చెప్పడం మరిచిపోయాం. మూస ధోరణిలో సినిమాలు చేసుకుంటూ వెళ్లిపోతున్నాం. ఇతర ఇండస్ట్రీల్లో వస్తున్న సినిమాలను మెచ్చుకుంటున్నాం తప్ప.. మనం అలాంటి ప్రయత్నాలు చేయడం లేదు’’ అని వ్యాఖ్యానించారు కరుణ కుమార్. తెలుగు పరిశ్రమలో ‘శంకరాభరణం’, ‘సిరివెన్నెల’, ‘జ్యోతి’, ‘విజేత’, ‘ఛాలెంజ్’ లాంటి సినిమాలు వచ్చాయి. అలాంటి కళాత్మక చిత్రాలు ఒకప్పుడు తెలుగులో వచ్చినంతగా ఏ భాషలోనూ రాలేదనే విషయం గుర్తుంచుకోవాలి అన్నారు కరుణ కుమార్.
తెలుగువాళ్లు కథలు చెబితే వినడానికి, చూడటానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని ‘అరుంధతి’, ‘బాహుబలి’లాంటి సినిమాలు వచ్చినప్పుడు తెలిసింది. నేను మాత్రం కథలు చెబుదామనే పరిశ్రమలోకి వచ్చా. అలా ‘పలాస’, ‘శ్రీదేవి సోడా సెంటర్’ లాంటి సినిమాలు చేశానన్నారు కరుణ కుమార్. ఇప్పటివరకు గోదావరి జిల్లాల సినిమాలు అంటే తెర నిండా అరిటాకులు, అమ్మమ్మల ఆప్యాతలు, పొలం గట్లు అనే వాతావరణమే చూశాం. అయితే మా ‘శ్రీదేవి సోడా సెంటర్’లో ఆ ప్రాంతం సామాజిక, ఆర్థిక కోణాల్ని, ఆ నేపథ్యంలో భావోద్వేగాల్ని చూపించబోతున్నాం అని చెప్పారు కరుణ కుమార్.