“అవార్డు ఫంక్షన్లకు వెళ్లి నా సమయం వృథా చేసుకోవడం నాకు నచ్చదు” అని అమీర్ ఖాన్ (Aamir Khan) పదే పదే చెబుతుంటే ఏదో అనుకునేవాళ్లం కానీ.. ఈమధ్య అవార్డు వేడుకలు నిర్వహిస్తున్న తీరు చూస్తే నిజమే అనిపిస్తుంది. ఎవరు అర్హులు అనే విషయాన్ని గాలికి వదిలేసి, ఎవరు అటెండ్ అయితే వాళ్ళకే అవార్డులు అనే పంథాను గత కొన్నాళ్లుగా ఫాలో అవుతున్నారు ఈవెంట్ ఆర్గనైజర్లు. మొన్న జరిగిన “ఐఫా అవార్డ్స్” వేడుక నిర్వహణ మీద మండిపడ్డాడు కన్నడ దర్శకుడు హేమంత్ రావు.
Star Director
దర్శకుడిగా “సప్త సాగరాలు దాటి”తో సౌత్ ఆడియన్స్ ను విశేషంగా అలరించిన హేమంత్ రావు (Hemanth M. Rao) .. ఇటీవల దుబాయ్ లో నిర్వహించిన “ఐఫా అవార్డ్స్” వేడుకకు ఆహ్వానించబడ్డాడు. ఉత్తమ దర్శకుడు (Star Director) కేటగిరీలో నామినేషన్ దక్కించుకున్న హేమంత్ రావును కనీసం పట్టించుకోలేదు ఐఫా అవార్డ్స్ బృందం. నిజానికి నామినేషన్ లో ఎన్ని సినిమాలు వచ్చాయి అనే విషయాన్ని అందరికీ తెలిసేలా సదరు నామినేటెడ్ సినిమాల లిస్ట్ ను తెరపై ప్రాజెక్ట్ చేసి, ఆ తర్వాత ఎవరు విన్నర్ అనేది ప్రకటిస్తారు.
కానీ.. దర్శకుడు హేమంత్ రావును పట్టించుకోకపోవడం అటుంచితే.. నామినేటెడ్ కేటగిరీ సినిమాలు ఏంటి అనేది కనీసం ప్రస్తావించలేదు. ఈ విషయమై కాస్త గట్టిగానే మండిపడ్డాడు హేమంత్ రావు. ట్విట్టర్ సాక్షిగా ఐఫా బృందాన్ని ప్రశ్నించిన తీరు అవార్డు వేడుకల నిర్వహణ విధానాన్ని ప్రశ్నించేలా చేసింది. అలాగని ఇదేమీ మొదటిసారి కాదు, ఇదివరకు ఓ అవార్డ్ వేడుకకు నామినేట్ అయినప్పటికీ,
కనీసం ఇన్విటేషన్ కూడా పంపలేదని గతంలో అడివి శేష్ (Adivi Sesh) కూడా ఇలానే ట్విట్టర్ వేదికగా తన కోపాన్ని కాస్తంత సుతారంగా వెళ్లగక్కాడు. ఈ పరిస్థితి ఇలానే కొనసాగితే అవార్డులు కొనుక్కుంటున్నారు అనే వాదనను మరింత బలపరిచిన వాళ్లవుతారు ఈవెంట్ ఆర్గనైజర్స్. అవార్డులకు మళ్లీ పూర్వ వైభవం రావాలంటే.. అవార్డులు ఇచ్చే విధానంలో మార్పులు కచ్చితంగా రావాలి.