బాలకృష్ణతో (Nandamuri Balakrishna) ఓ సినిమా చేయడం అంటే.. వరుస ప్రాజెక్ట్‌లు చేయడమే అంటుంటారు. అంటే ఆయన ఓ సినిమా చేసిన దర్శకుడు మరోసారి సినిమా చేయడానికి ముందుకొస్తారు అని. అయితే ఫస్ట్ చేసిన సినిమా విజయం సాధించాలి అనుకోండి. అలా తొలి సినిమాతో మంచి విజయం అందుకున్న ప్రముఖ దర్శకుడు గోపీచంద్ మలినేని (Gopichand Malineni) ఇప్పుడు రెండో సినిమా అంతా రెడీ చేసుకున్నారు. ఎంతలా రెడీ అయ్యారు అంటే.. సినిమా ఓపెనింగ్ తేదీని కూడా ఫిక్స్ చేసేసుకున్నారు.
సన్నీ డియోల్ (Sunny Deol) ‘జాట్’ (Jaat) సినిమాతో బాలీవుడ్‌లోనూ విజయం అందుకున్న ఆయన.. ఇప్పుడు బాలయ్యతో మరో సినిమా స్టార్ట్ చేయబోతున్నారు. ‘వీరసింహారెడ్డి’ (Veera Simha Reddy) సినిమా విజయం తర్వాత వీళ్లిద్దరూ ఈ సినిమా కోసమే పని చేస్తున్నారు. దీనిపై దర్శకుడు గోపీచంద్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో సమాచారం అందించారు. పూర్తిగా యాక్షన్ జోనర్‌లో ఈ సినిమా ఉండనుందని, ప్రస్తుతం స్క్రిప్ట్ పనులు జరుగుతున్నాయని గోపీచంద్ తెలిపారు. అంతేకాదు బాలకృష్ణ పుట్టినరోజు సందర్భంగా జూన్ 10న సినిమాను లాంఛనంగా ప్రారంభించనున్నట్లు తెలిపారు.
ప్రస్తుతం బాలకృష్ణ.. బోయపాటి శ్రీను (Boyapati Srinu) ‘అఖండ 2: తాండవం’ సినిమా పనుల్లో బిజీగా ఉన్నారు. ఆ ప్రాజెక్ట్ పూర్తయిన వెంటనే ఈ సినిమా కోసమే బాలయ్య రంగంలోకి దిగనున్నట్లు తెలుస్తోంది. ఈ ప్రాజెక్ట్‌ను ‘పెద్ది’ (Peddi) సినిమా ప్రొడ్యూసర్లు వృద్ధి సినిమాస్ నిర్మించనుందని సమాచారం. అయితే మరో బ్యానర్‌తో కలిసే తెరకెక్కిస్తారట. అది బాలయ్య చిన్న కూతురు తేజస్వినికి చెందిన లెజెండ్ ప్రొడక్షన్స్ అని తెలుస్తోంది. త్వరలోనే ఈ విషయంలో క్లారిటీ ఇస్తారట.
ఇక గోపీచంద్ మలినేని ‘జాట్ 2’ సినిమాను కూడా ప్రకటించారు. వచ్చే ఏడాది ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్లే అవకాశమున్నట్లు గోపీచంద్ మలినేని తెలిపారు. రెండో భాగంలో సన్నీ దేవోల్ పాత్ర కుటుంబ నేపథ్యాన్ని చూపిస్తారట. దీంట్లో ‘జాట్’ సినిమా కంటే ఎక్కువ యాక్షన్, ఎమోషన్, కామెడీ ఉంటాయని గోపీచంద్ తెలిపారు.