ఆర్టిఫిషియల్ ఇంటెలిజన్స్ (ఏఐ) వచ్చింది. దీంతో ఉద్యోగాలు పోతున్నాయి, జీవితాలు ఇబ్బందుల్లో పడుతున్నాయి అని గత కొంతకాలంగా మనం వార్తలు వింటూనే ఉన్నాం, చూస్తూనే ఉన్నాం. సినిమా రంగలోకి కూడా ఏఐ వచ్చేస్తే పరిస్థితి ఇంకా దారుణంగా ఉంటుంది అని ఆ రంగంలోని వాళ్లు ఆందోళన చెందుతున్నారు. ఈ విషయంలో మన దగ్గర ఇంకా అంత ఇబ్బందికర పరిస్థితి లేదు కానీ.. విదేశీ సినిమా పరిశ్రమల్లో ఇబ్బంది ఉంది అనేది ఓ వాదన.
దీని మీద ప్రముఖ దర్శకుడు జేమ్స్ కామెరూన్ (James Cameron) ఇటీవల స్పందించారు. ఇటీవల ఆయన స్టెబిలిటీ ఏఐ డైరెక్టర్ల బోర్డులో చేరారు. జేమ్స్ కామెరూన్. ‘టైటానిక్’, ‘అవతార్’ లాంటి బ్లాక్‌బస్టర్ హిట్‌లను తెరకెక్కించిన జేమ్స్ కామెరూన్ (James Cameron) ఏఐని సినిమాల్లోకి తీసుకురావడం వల్ల ఉపయోగాలు ఉన్నాయని చెప్పారు. అయితే ఎంతవరకు తీసుకోవాలి అనేదే ఇక్కడ పాయింట్ అని చెప్పారు. తన వరకు అయితే సినిమా నిర్మాణ ఖర్చులను తగ్గించుకోవడానికే ఏఐని వాడుకోవాలి అని అనుకుంటున్న చెప్పారు.
అంతేకానీ ఏఐ ద్వారా టీమ్‌లో సభ్యుల్ని తగ్గించే ఉద్దేశం లేదు అని చెప్పారు. ఏఐ ఊహాజనితమైంది కాదని కూడా చెప్పారు. సినిమాల్ని నిర్మించడానికి, భారీ విజువల్ ఎఫెక్ట్స్‌తో సినిమాలు తీయడానికి చాలా బడ్జెట్ అవసరం. అయితే ఏఐ సాయంతో అలాంటి సినిమాల నిర్మాణ ఖర్చును సగానికి తగ్గించుకోవడం ఎలా అనేది తెలుసుకోవాలి. అలా అని విజువల్ ఎఫెక్ట్స్ కంపెనీల్లో సిబ్బందిని తొలగించడం కోసం కాదు అని కాస్త ఘాటుగానే సమాధానం ఇచ్చారు జేమ్స్ కామెరూన్ (James Cameron) .
ఏఐని ఉపయోగించి సన్నివేశాన్ని రెట్టింపు వేగంతో ఎలా తీయగలమనే విషయంపై దృష్టి పెట్టాలి అని ఆయన సూచించారు. ఇప్పటికైతే చాలా రంగాల్లో ఏఐ వినియోగం అంటే మ్యాన్ పవర్ తగ్గింపు అనే అంశమే చర్చలోకి వస్తోంది. మరిప్పుడు కామెరూన్ చెప్పినట్లుగా భవిష్యత్తులో సినిమా పరిశ్రమ ఆలోచిస్తుందా? లేక అందరిలానే జనాల్ని తగ్గించుకుంటూ వెళ్తుందా అనేది చూడాలి.