కొన్ని రోజులుగా బాలీవుడ్ ఇండస్ట్రీని బాగా టార్గెట్ చేస్తున్నారు నెటిజన్లు. ఇండస్ట్రీలో ఎలాంటి సినిమా వచ్చినా.. అది డిజాస్టర్ దిశగా అడుగులు వేస్తోంది. పాజిటివ్ టాక్ వచ్చిన సినిమాలకు కూడా కలెక్షన్స్ లేవు. ముందుగా ఆమిర్ ఖాన్ ‘లాల్ సింగ్ చద్దా’తో మొదలైన బాయ్‌కాట్ ట్రెండ్ ఇప్పుడు అక్షయ్ కుమార్ ‘రక్షాబంధన్’.. త్వరలోనే విడుదల కానున్న హృతిక్ రోషన్ ‘విక్రమ్ వేద’ సినిమాలకు తాకింది. తాజాగా ఈ బాయ్‌కాట్ ట్రెండ్ పై హీరో అర్జున్ కపూర్ స్పందించారు.
ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా ఓ పోస్ట్ పెడుతూ.. బాలీవుడ్ ఇండస్ట్రీ యూనిటీతో ఈ సమస్యను ఎదుర్కోవాలని పిలుపునిచ్చారు. ఇంతకాలం బాయ్‌కాట్ పై సైలెంట్ గా ఉండి తప్పు చేశామని.. అది మా మర్యాద అనుకున్నామని చెప్పారు. ఇన్నాళ్లూ మా పనితనమే దీనికి సమాధానం ఇస్తుందనుకొని పొరబడ్డామని.. కానీ కొందరు దీంతో ప్రయోజనం పొందడం మొదలుపెట్టారని అన్నారు. బురదలో చేయి పెట్టడం ఎందుకని మేం అనుకుంటుంటే.. తమ సహనాన్ని చేతకానితనంగా చూస్తున్నారని మండిపడ్డారు.
బాయ్‌కాట్ ను ఓ ట్రెండ్ గా మారుస్తున్నారని అన్నారు. మన గురించి రాసే రాతలు, ట్రెండ్ చేసే హ్యాష్ ట్యాగ్ లు నిజానికి చాలా దూరంగా ఉన్నాయని.. దీన్ని ఎదుర్కోవడానికి మనమంతా ఒకటి కావాలని చెప్పారు. సినిమాలను బ్యాన్ చేసే సంస్కృతి మంచిది కాదని అసహనం వ్యక్తం చేశారు. ఒకప్పుడు ప్రతి శుక్రవారం ప్రజల్లో ఉత్తేజంగా ఉండేదని..
కొత్త సినిమా కోసం వాళ్ళు ఆసక్తి చూపిస్తుంటే ఇండస్ట్రీ చాలా హ్యాపీగా ఉండేదని.. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి పూర్తిగా మారిపోవడం ఆలోచించాల్సిన విషయమని చెప్పుకొచ్చారు. అర్జున్ కపూర్ మాదిరి బాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి ఈ బాయ్‌కాట్ పై ఎవరైనా స్పందిస్తారేమో చూడాలి!