సినీ పరిశ్రమలో వరుస విషాదాలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి.కమెడియన్ అల్లు రమేశ్ మరణించి మూడు రోజులు కూడా కాకుండానే ఈరోజు నిండా పాతికేళ్ళు కూడా లేని కొరియన్ పాప్ సింగర్ అలాగే నటుడు అయిన మూన్ బిన్ మరణించాడు. అలాగే బాలీవుడ్ స్టార్ సింగర్, ప్రొడ్యూసర్ పమేలా చోప్రా కూడా కన్నుమూసింది. ఈ రెండు వార్తలతో షాక్ లో ఉన్న సినీ అభిమానులకి ఇప్పుడు మరో షాకింగ్ న్యూస్ వినాల్సి వచ్చింది.
ఓ టాలీవుడ్ నిర్మాత (Star Producer) ఇంట్లో తీవ్ర విషాదం చోటు చేసుకోవడం గమనార్హం.వివరాల్లోకి వెళితే.. ప్రముఖ నిర్మాత, మైత్రీ మూవీ మేకర్స్ సీఈవో అయిన చెర్రీ (చిరంజీవి) తల్లి ఈరోజు మరణించారు. కొన్నాళ్లుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతూ వస్తున్న ఆమె ఈరోజు మరణించినట్టు తెలుస్తుంది. ఈ విషయం కాస్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చిందని చెప్పాలి. చెర్రీ తల్లి మరణించిన విషయాన్ని ఆయన సన్నిహితులు తెలియజేశారు.1994లో చెర్రీ సినీ పరిశ్రమలోకి అడుగు పెట్టారు.
మొదట్లో ప్రముఖ దర్శకుడు.. రామ్ గోపాల్ వర్మ తీసిన ‘మనీ’, ‘రంగీలా’ సినిమాలకి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా పనిచేశారు. అటు తర్వాత ‘గులాబీ’ ‘ఛత్రపతి’ ‘విక్రమార్కుడు’ ‘యమదొంగ’ వంటి సినిమాలకు నిర్మాణ భాగస్వామిగా వ్యవహరించారు. అటు తర్వాత ‘క్లాప్ ఎంటర్టైన్మెంట్స్’ బ్యానర్ పై ‘ఒక్కడున్నాడు’ ‘మత్తు వదలరా’ ‘హ్యాపీ బర్త్ డే’ ‘మీటర్’ వంటి సినిమాలు నిర్మించారు చెర్రీ. ఇక చెర్రీ తల్లిగారి ఆత్మకు శాంతి కలగాలని సినీ పరిశ్రమలో ఉన్న ఆయన స్నేహితులు తమ ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నారు.