దక్షిణాది చలన చిత్ర పరిశ్రమలో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ గాయకుడు, నటుడు అయిన మాణిక్య వినాయగం (73) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన… ఇటీవల కన్నుమూశారు. డిసెంబరు 10, 1943న జన్మించిన మాణిక్య వినాయగం.. చిన్నతనం నుండే సంగీత పాఠాలు నేర్చుకున్నారు. తన మామయ్య, ప్రముఖ గాయకుడు సీఎస్ జయరామన్ దగ్గర సంగీతం అభ్యాసం చేశారు.
తొలిసారి ‘దిల్’ (2001) అనే తమిళ చిత్రంతో సినిమా పరిశ్రమలో గాయకుడిగా ప్రస్థానాన్ని మొదలుపెట్టారు. కెరీర్‌లో ఆయన అన్ని భాషల్లో కలిపి 800లకిపైగా పాటలు ఆలపించారు. ఇవి కాకుండా 15 వేలకుపైగా ఆధ్యాత్మిక, జానపదాల్ని ఆలపించారు. అలా వెండితెర అయినా, బయట అయినా… పాడిన ప్రతి పాట సంగీత అభిమానుల్ని ఉర్రూతలూగించిందని చెప్పొచ్చు.
ఇక తెలుగు చలన చిత్ర పరిశ్రమ సంగతి చూస్తే… మెగాస్టార్ చిరంజీవి బ్లాక్‌బస్టర్ ‘శంకర్ దాదా MBBS’లో ‘పట్టుపట్టు చేయ్యే పట్టు…’ ఆయన ఆలపించిందే. ఆ తర్వాత ఆయన తెలుగులో పెద్దగా పాటలు పాడింది లేదు. మరోవైపు నటుడిగానూ మాణిక్య వినాయగం తనదైన ముద్రవేశారు. వివిధ తమిళ చిత్రాల్లో కీలక పాత్రలు పోషించారు. ఆయన పాడిన ఆఖరి పాట ‘విరుగంబాక్కం’లోని ‘పతిలాడి’ అనే పాట. 2015లో ఈ సినిమా వచ్చింది.
ఇక నటన సంగతి చూస్తే 2017లో వచ్చిన ‘88‘ ఆఖరి సిమా. మంచు మనోజ్ హీరోగా నటించిన ‘దొంగ దొంగది’ సినిమాలో మనోజ్‌కు తండ్రిగా నటించింది మాణిక్య వినాయగమే. కెరీర్‌లో సుమారు 20 సినిమాల్లో నటించారు.