పవన్ కల్యాణ్ (Pawan Kalyan) రాజకీయాలలోకి రావాలా? వద్దా? వచ్చాక ఇప్పుడు ఉండాలా? వద్దా? అనే చర్చ నడుస్తూనే ఉంది. ఇంకా అది నడుస్తూనే ఉంటుంది. ఎందుకంటే ఆయనను అభిమానించేవాళ్లలో ఒక్కొక్కరికి ఒక్కో ఆలోచన ఉంటుంది. అయితే గతంలో పవన్ కల్యాణ్ మీద రాజకీయ విమర్శలు చేసిన ఓ రచయిత ఇప్పుడు ఆయన పొలిటికల్ కెరీర్ గురించి ఓ విషయం చెప్పారు. గతంలో పవన్ దగ్గర మాట్లాడిన మాట, దానికి ఆయన రియాక్షన్‌ను ఇప్పుడు చెప్పారు. దీంతో ఆ మాటలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.
పవన్ కళ్యాణ్ మీద తొలినాళ్లలో కోన వెంకట్ చాలా అభిమానంగా ఉండేవారు. అవకాశం వచ్చినప్పుడల్లా ఆకాశానికెత్తేసేవారు. అయితే 2019 ఎన్నిలకు ముందు వైఎస్‌ఆర్‌సీపీ తీర్థం పుచ్చుకున్నాక పరస్థితి మారిపోయింది. సాక్షికి ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో పవన్ మీద తీవ్ర విమర్శలు, ఆరోపణలు చేశారు కోన వెంకట్ (Kona Venkat) . దీంతో అప్పటివరకు అతననిని అభిమానించిన పవన్ ఫ్యాన్స్‌కి ఒక్కసారిగా శత్రువుగా మారిపోయారు. సోషల్ మీడియాలో ఫ్రై చేసేశారు. దీంతో ఆ తర్వాత పవన్ పేరును ఎక్కడా ఎత్తలేదు.
అయితే, మళ్లీ ఇన్నాళ్లు అది కూడా ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు మళ్లీ పవన్ గురించి మాట్లాడారు కోన వెంకట్. రాజకీయాల విషయంలో పవన్‌కు గతంలో ఓసారి సలహా ఇస్తే.. ఎలా రియాక్ట్ అయ్యాడు అనే విషయం కూడా చెప్పారు. పవన్ కల్యాణ్‌తో ఓసారి ‘నీకెందుకు రాజకీయాలు? అసలే ఇంట్రోవర్ట్‌వి, సెన్సిటివ్ కూడా. ఎవడు పడితే వాడు మాటలు అంటున్నాడు అవసరమా’ అని అన్నారట కోన వెంకట్.
ఆ మాటలకు పవన్ ‘నీ ఒపీనియన్ మడిచి నీ దగ్గరే పెట్టుకో’ అని అన్నాడని కోన వెంకట్ తెలిపారు. ఆయన ఏ ఫ్లోలో అలా అన్నాడు, ఇంకా ఏమైనా అన్నాడా అనేది తెలియదు కానీ… పవన్ ఫ్యాన్స్ మాత్రం ఆ కామెంట్ విని ‘మా మనసులో మాట కూడా అదే’ అని అంటున్నారు. దీనికి కారణం 2019లో కోన వెంకట్ చేసిన విమర్శలే అని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.