గతకొద్ది రోజులుగా వరుస మరణాలు చిత్ర పరిశ్రమను కుదిపేస్తున్నాయి.. టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్, శాండల్ వుడ్, మాలీవుడ్ ఇండస్ట్రీలకు చెందిన పలువురు సినీ ప్రముఖులు పలు కారణాల వల్ల మృతిచెందారు. దీంతో, ఏ క్షణాన ఎలాంటి దుర్వార్త వినాల్సి వస్తుందోనని కంగారు పడుతున్నారు సినిమా పరిశ్రమ వర్గాలవారు.. ఇక సెలబ్రెటీలు వరుసగా కన్ను మూయడంతో వారి కుటుంబ సభ్యులే కాదు.. అభిమానులు సైతం శోక సంద్రంలో మునిగి పోతున్నారు. సూపర్ స్టార్ కృష్ణ గారి మరణవార్త మర్చిపోకముందే.. తెలుగు ఇండస్ట్రీ ఓ టాలెంటెడ్ డైరెక్టర్‌ని కోల్పోయింది.. దర్శకుడు మదన్ ఆకస్మిక మరణం చెందారు.
అలాగే బెంగాళీ నటి ఇంద్రీలా శర్మ, పంజాబ్ ఇండస్ట్రీకి చెందిన టాప్ హీరోయిన్ దల్జీత్ కౌర్ ఖంగురా వంటి వారు కన్నుమూశారు. బాలీవుడ్ సీనియర్ యాక్టర్ విక్రమ్ గోఖలే, విశ్వనటుడు కమల్ హాసన్, కన్నడ స్టార్ ఉపేంద్ర వంటి వారు ఆసుపత్రిలో చేరారనే వార్తలతో అంతా షాక్ అయ్యారు. ఇటీవల మలయాళీ పరిశ్రమకు చెందిన ప్రముఖ నటుడు, రచయిత బి. హరి కుమార్ మరణించారు. ఆ వార్త ఇంకా మరువకముందే మాలీవుడ్ ఇండస్ట్రీలో మరో విషాదం చోటు చేసుకుంది.
ప్రముఖ మలయాళ సినీ రచయిత సతీష్ బాబు మృతి చెందారు. ఆయన పూర్తి పేరు సతీష్ బాబు పయ్యనూర్. గురువారం ఉదయం త్రివేండ్రంలో గల, వంచియూర్‌లోని తన నివాసంలో ఆయన తుదిశ్వాస విడిచారు. బుధవారం రాత్రి తన గదిలోకి వెళ్లి గడియ పెట్టుకున్న సతీష్ గురువారం ఉదయం ఎంతకీ బయటకు రాలేదు.దీంతో బంధువులు, స్థానికులు ఆయన ఫోన్‌కు పలు మార్లు ఫోన్ చేసినా ఎలాంటి స్పందన రాకపోవడంతో.. పోలీసులకు సమాచారం ఇచ్చారు.
సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్నారు. సతీష్ ఇంటి తలుపులు బద్ధలు కొట్టి లోపలకు వెళ్లారు. సతీష్ తన గదిలో విగతజీవిగా కనిపించారు. అయితే ఆయన మరణం పట్ల ఎలాంటి అనుమానాలు లేవని పోలీసులు తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. మలయాళంలో పలు సీరియల్స్, సినిమాలకు రచయితగా పని చేశారాయన. 2012లో ఆయన రాసిన ‘పెరమరన్’ పుస్తకానికి కేరళ సాహిత్య అకాడమీ అవార్డు వచ్చింది. సతీష్ బాబు మృతి పట్ల సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.