రాజమౌళి పుణ్యమా అని టాలీవుడ్లో కూడా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు అజయ్ దేవగన్, సుదీప్ లు. ‘ఈగ’ సినిమాలో విలన్ గా సుదీప్ నటిస్తే.. అదే సినిమా హిందీ వెర్షన్ లో భాగంగా సుధీప్ పాత్రకి డబ్బింగ్ చెప్పాడు అజయ్ దేవగన్. తర్వాత ‘బాహుబలి’ లో సుదీప్, ‘ఆర్.ఆర్.ఆర్’ లో అజయ్ దేవగన్ చిన్న చిన్న పాత్రలు పోషించారు.అయితే ఇప్పుడు ఈ ఇద్దరి మధ్య ట్వీట్ల యుద్ధం మొదలవ్వడం చర్చనీయాంశం అయ్యింది.
సౌత్ మూవీస్ అయిన ‘పుష్ప-1’, ‘ఆర్ఆర్ఆర్’, ‘కేజీఎఫ్-2’ వంటి పాన్ ఇండియా సినిమాలు హిందీలో భారీ కలెక్షన్లను రాబట్టాయి. అంతేకాకుండా అక్కడి బాలీవుడ్ హీరోల ఇమేజ్ పై కూడా దెబ్బ కొట్టాయి. ఒక్క అక్షయ్ కుమార్ మాత్రమే తన పని తాను చూసుకుంటున్నాడు కానీ మిగిలిన హీరోలు సౌత్ హీరోల వల్ల ఫ్రస్ట్రేట్ అవుతున్నారు. అక్కడి క్రిటిక్స్ కూడా సౌత్ సినిమాల పై నోరు పారేసుకుంటున్నారు. ఈ క్రమంలో సుదీప్ ట్విట్టర్లో “బాలీవుడ్ మేకర్స్ తమ సినిమాలను సౌత్ లో డబ్ చేసి హిట్ కొట్టడానికి కష్టపడుతుంటే..
మన సౌత్ సినిమాలు మాత్రం అక్కడ ఈజీగా సక్సెస్ అవుతున్నాయి. ఇకపై హిందీ జాతీయ భాష కాదు” అంటూ పేర్కొన్నాడు. ఈ వ్యాఖ్యలను బాలీవుడ్ హీరో అజయ్ దేవ్ గణ్ ఖండించాడు. “హిందీ జాతీయ భాష కాకపోతే మీ మాతృభాష సినిమాలను హిందీలో డబ్ చేసి ఎందుకు విడుదల చేస్తున్నట్టు?” అంటూ సుధీప్ కు ఎదురు ప్రశ్న వేసాడు.
ఇప్పటికీ ఎప్పటికీ హిందీనే మన జాతీయ భాష అది మర్చిపోవద్దు అంటూ అజయ్ ట్వీట్ చేశాడు. ఈ క్రమంలో సుదీప్ “నా వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకున్నారని,మనమంతా ఒకటే అని, మన మాతృభాషని గౌరవించుకుంటూ ఇతర భాషలను గౌరవించుకోవాలంటూ’ జవాబిచ్చాడు. ప్రస్తుతం వీరి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.