సూపర్ స్టార్ కృష్ణ గారి ఫ్యామిలీ నుండీ వచ్చిన హీరోల్లో సుధీర్ బాబు ఒకరు.’ఏమాయ చేసావే’ చిత్రంతో నటుడిగా పరిచయమైన సుధీర్ బాబు… ‘ఎస్.ఎం.ఎస్’ చిత్రంతో హీరోగా మారాడు. అటు తర్వాత ‘ప్రేమ కధా చిత్రమ్’ ‘భలే మంచి రోజు’ ‘సమ్మోహనం’ వంటి హిట్ సినిమాల్లో కూడా నటించాడు. అయితే జయాపజయాలతో సంబంధం లేకుండా సుధీర్ బాబు ప్రతీ సినిమాకి పెట్టే ఎఫర్ట్ కారణంగానే.. అతనికి ఇప్పటికీ మంచి అవకాశాలు లభిస్తున్నాయి.
డ్యాన్స్ చేయగలడు, ఫైట్లు కూడా అద్భుతంగా చేయగలడు, సిక్స్ ప్యాక్ బాడీ ఉంటుంది,నటుడిగా కూడా ఓకె అనిపించుకున్నా.. ఎందుకో మాస్ ఆడియెన్స్ కు దగ్గరయ్యే విషయంలో అతను వెనుకపడే ఉన్నాడు.బాలీవుడ్ లో కూడా అడుగుపెట్టి మంచి నటుడు అనిపించుకున్నాడు కానీ అక్కడ కూడా అతనికి శుభారంభం దక్కలేదు.ఇదిలా ఉండగా… సుధీర్ బాబు హీరోగా పరిచయమైన ‘ఎస్.ఎం.ఎస్’ చిత్రం 2012 ఫిబ్రవరి 10న విడుదలయ్యింది. అంటే రేపటితో అతను హీరోగా తెరంగేట్రం చేసి 10ఏళ్ళు పూర్తికావస్తోంది.
ఈ నేపథ్యంలో అతను మీడియా సమావేశంలో పాల్గొని కొన్ని ఆసక్తికరమైన విషయాలను చెప్పుకొచ్చాడు. ఈ క్రమంలో అతనికి ‘ఈ 10ఏళ్ళలో ఏ దర్శకుడితో పనిచెయ్యడం మీకు కష్టమనిపించింది?’ అనే ప్రశ్న ఎదురైంది? దీనికి అతను ‘ప్రేమ కథా చిత్రం’ చేస్తున్నప్పుడు మారుతి గారితో చేయడం కష్టమనిపించింది అని బదులిచ్చాడు. ‘ఆయన వర్కింగ్ స్టైల్ చాలా డిఫరెంట్ గా ఉంటుంది, స్పాట్ లోనే కొన్ని సీన్స్ రాస్తారు.అవి ఓన్ చేసుకుని స్పాట్ లోనే నటించల్సి ఉంటుంది.
కొంచెం ఎక్కువ ఎలర్ట్ గా వుండాలి’ అంటూ అతను చెప్పుకొచ్చాడు. అయితే ఆ చిత్రానికి మారుతీ దర్శకుడు కాదు. టైటిల్ కార్డ్స్ లో జె.ప్రభాకర్ రెడ్డి పేరు పడుతుంది. దానికి రైటర్ గా మాత్రమే మారుతీ పేరు పడుతుంది. అయినప్పటికీ సుధీర్ బాబు ఇలా చెప్పడం గమనార్హం. ‘బహుశా సుధీర్ బాబు నోరు జారాడా’ అనే చర్చలు ఇప్పుడు ఎక్కువయ్యాయి.