పవన్ కల్యాణ్‌ను అభిమానులు ఎలా చూడాలని అనుకుంటున్నారో.. అలా చూపించి అందరి మనసులు కొల్లగొట్టారు దర్శకుడు సుజీత్. రెండు సినిమాలే తీసిన అనుభవం ఉన్న సుజీత్.. స్టార్ హీరోను ఎవరూ ఊహించని విధంగా హ్యాండిల్ చేసి మెచ్చుకోలు పొందారు. ఈ క్రమంలో తనలోని ఫ్యాన్‌ని సంతృప్తి పరుచుకోవడానికి.. ఫ్యాన్స్‌ని హ్యాపీ చేయడానికి పవన్ పాత సినిమాల రిఫరెన్స్‌లు చాలానే పెట్టారు. అవును ‘జానీ’ సినిమా ఒక్కటే కాదు.. చాలానే ఉన్నాయి. అందులో కొన్ని మీకోసం.
పవన్ కల్యాణ్- సుజీత్ కాంబో ఓకే అవ్వడానికి కారణం ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ అనే విషయం తెలిసిందే. ఇటీవల సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్‌లో పవనే చెప్పారు. ఇక్కడ మరో విషయం ఏంటంటే.. సుజీత్ ఫేవరెట్ సినిమా ‘అతడు’. ఆ సినిమాలో హీరో పేరును ఇప్పుడు ‘ఓజీ’ సినిమాకు కనెక్ట్ చేశారు. పార్థు పాత్ర మరణంతో ‘అతడు’ సినిమాలో అసలు కథ మొదలైనట్టే ‘ఓజీ’ సినిమాలోనూ అదే పాత్ర పేరు చావుతో స్టోరీ ప్రారంభమవుతుంది.
ఇక సినిమా ఇంటర్వెల్ ముందు ఒకసారి, సినిమా క్లైమాక్స్‌లో ఒకసారి ‘జానీ’ ప్రస్తావన వస్తుంది. క్లైమాక్స్‌లో అయితే ఏకంగా ‘జానీ’, ‘తమ్ముడు’ సినిమాలోని హిట్ సాంగ్స్‌ని రీమిక్స్ చేసి ఓ పాటను పెట్టారు. ఆ పాటకు థియేటర్లలో ఫ్యాన్స్ హడావుడి మామూలుగా ఉండదు. ఇక ‘జానీ’ సినిమాలో హీరోయిన్ పాత్ర పేరు గీతను కూడా వాడారు. ‘ఓజీ’ సినిమాలో శ్రియా రెడ్డి పాత్ర పేరు అదే. అలాగే ‘తమ్ముడు’ సినిమాలో పవన్‌కు గురువుగా కనిపించిన సూర్య.. ఈ సినిమాలోనూ కూడా అదే పాత్రలో ఉంటారు.
సినిమాలో ఇవి మాత్రమే కాదని.. ఇంకా చాలా చోట్ల స్పెషల్ ఎలిమెంట్స్ ఉన్నాయని అంటున్నారు. సినిమా ఓటీటీలోకి వచ్చాక పాయింట్ టు పాయింట్ పట్టుకుంటే ఇంకా చాలా విషయాలు తెలుస్తాయి. ఈలోపు ఏవన్నా బయటికొస్తే అవి కూడా మీకు చెబుతాం.