ప్రస్థానంతో వెండితెరపై అడుగుపెట్టిన యువ హీరో సందీప్ కిషన్.. ఆ తర్వాత వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ హిట్ తో మంచి అవకాశాలు అందిపుచ్చుకున్నారు. ప్రముఖ కెమెరామెన్ చోటా కె నాయుడు మేనల్లుడు అయినప్పటికీ సొంతకాళ్లపై నిలబడ్డారు. ఇటు టాలీవుడ్, కోలీవుడ్ లో సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నారు. గత కొంతకాలంగా హిట్ ఏమి లేకపోవడంతో ఆశలన్నీ తన తాజా చిత్రం C/O సూర్యా పెట్టుకున్నారు. సుసీంద్రన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో మెహ్రీన్ పిర్జాదా హీరోయిన్ గా నటిస్తోంది. ఈ మూవీ ఈ నెల 10న రిలీజ్ కానుంది. ఈ సినిమా ప్రచారంలో భాగంగా మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూ లో సినీ విశేషాలతో పాటు అనేక సంగతులు వెల్లడించారు.
“మహేష్ బాబు సార్ ఒక సూపర్ స్టార్ అయినప్పటికీ చాలా విభిన్నమైన పాత్రలను చేయడానికి ఇష్టపడతారు. ఏదైనా కొత్తగా చేయాలని ప్రయత్నిస్తుంటారు. ఆ ఆలోచనే ఆయనను సూపర్ స్టార్ చేసి ఉంటుందని నా నమ్మకం. అందుకే నేను కూడా కథ ఎంపికలో మహేష్ సార్ ని స్ఫూర్తిగా తీసుకున్నాను” అని సందీప్ చెప్పారు. ప్రస్తుతం సందీప్ కిషన్ సూపర్ స్టార్ కృష్ణ కుమార్తె మంజుల దర్శకత్వంలో ఓ మూవీ చేస్తున్నారు.