పెద్ద హీరోతో సినిమా కాకపోయినా.. టాలీవుడ్‌లో గత కొన్నేళ్లుగా మాట్లాడిన, ఇప్పుడు పెద్దగా మాట్లాడని సినిమా ‘పవర్ పేట’. గుర్తొచ్చిందా ఈ సినిమా అప్పుడెప్పుడో నితిన్ – కృష్ణ చైతన్య కాంబినేషన్‌లో అనౌన్స్ అవ్వడానికి అంతా రెడీ చేసుకున్న సినిమా ఇది. చాలా రోజులు ఈ సినిమా గురించి చర్చలు జరిగాయి. ఎందుకంటే సగటు తెలుగు సినిమా స్టైల్‌కు చాలా దూరంగా ఈ సినిమా ఉంటుంది అని అప్పట్లో చెప్పుకొచ్చారు. ఇప్పుడు వివిధ పరిస్థితుల నేపథ్యంలో ఈ సినిమా చేతులు మారింది అని అంటున్నారు. అలాగే నిర్మాత కూడా మారారు అని సమాచారం.
‘రౌడీ ఫెలో’, ‘చల్ మోహనరంగా’, ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ సినిమాలతో డిఫరెంట్ దర్శకుడు అనే పేరు తెచ్చుకున్నారు కృష్ణ చైతన్య. అయితే విజయం విషయంలో మాత్రం ఇంకా ఆశించిన ఫలితం అందుకోవడం లేదు. ఈ క్రమంలో ‘పవర్ పేట’ పేరుతో ఒక కథ రాసుకున్నారు. నితిన్ హీరోగా తెరకెక్కించాలని ప్లాన్ చేశారు. బడ్జెట్ కారణాలు, నితిన్‌కు వరస ఫ్లాపులు, కృష్ణ చైతన్య సినిమాల ఫలితాలు ఇలా కొన్ని కారణాల వల్ల అది కార్యరూపం దాల్చలేదు. ఇప్పుడు వేరే హీరో, నిర్మాతతో పట్టాలెక్కించే పనిలో ఉన్నారని సమాచారం.
‘యాత్ర’, ‘ఆనందో బ్రహ్మ’ లాంటి సినిమాలు తీసిన 70 ఎంఎం ఎంటర్ టైన్మెంట్స్ నిర్మాణంలో ఈ సినిమా స్టార్ట్ అవుతుంది అని చెబుతున్నారు. హీరోగా సందీప్ కిషన్ నటిస్తాడని సమాచారం. గతంలో వచ్చిన సమాచారం ప్రకారం అయితే ‘పవర్ పేట’ సినిమా మూడు భాగాలుగా రావాలి. కానీ ఇప్పుడు ఒక్క పార్ట్‌గానే తీద్దాం అనుకుంటున్నారట. గుంటూరు నగరం నేపథ్యంలో ఒక గ్యాంగ్ స్టర్ బాల్యం నుంచి వయసు మళ్లే దాకా జరిగిన పరిణామాలు సినిమాలో చూపిస్తారట..
70 ఎంఎం ఎంటర్‌టైన్మెంట్స్ టీమ్ ఐదుగురు యువ హీరోలతో సినిమా అనౌన్స్ చేసి రీఎంట్రీ స్ట్రాంగ్‌గా ఇచ్చే ఉద్దేశంలో ఉందని సమాచారం. ఈ సినిమా ఆ ఐదులో ఒకటి అని చెబుతున్నారు.