బాలీవుడ్‌లో ‘రామాయణ’ అనే సినిమా రెండు పార్టులుగా రూపొందుతున్న విషయం తెలిసిందే. నితీశ్ తివారి దర్శకత్వంలో రూపొందుతున్న ఆ సినిమాలో రాముడిగా రణ్‌బీర్ కపూర్.. సీతగా సాయిపల్లవి.. రావణుడిగా యశ్ నటిస్తున్నారు. ఇక మరో ముఖ్యపాత్ర హనుమంతుడిగా సన్నీ డియోల్ నటిస్తున్నాడు. ఈ పాత్ర గురించేంటి ప్రత్యేకంగా చెబుతున్నారు అనుకుంటున్నారా? ఆ పాత్ర ఇప్పుడు ప్రత్యేకంగా మారబోతోంది కాబట్టి.
Sunny Deol
అవును, మీరు ఊహించింది నిజమే. హనుమంతుడి ప్రధానపాత్రలో ఓ సినిమా రాబోతోంది. ఆ సినిమా ‘రామాయణ’ సిరీస్‌లో భాగంగా ఉండబోతోంది అని బాలీవుడ్ టాక్. ‘రామాయణ’ను కేవలం సినిమాగా కాకుండదా.. ఓ ప్రపంచంగా రూపొందించాలని నితీశ్ తివారి అనుకుంటున్నారట. అందుకే ఈ సినిమా రెండు పార్టులు వచ్చాక.. మూడో ప్రయత్నంగా ‘హనుమాన్’ సినిమా తెరకెక్కించాలని భావిస్తున్నారట. ఈ విషయం ఇప్పటికే సన్నీ డియోల్‌కి కూడా చెప్పారట.
నితీశ్ తివారీ ‘రామాయణ’ ప్రపంచాన్ని విస్తరించాలనుకుంటున్నారు. ఇందులో భాగంగా రామాయణ విశ్వానికి కీలకంగా నిలిచిన హనుమాన్ సెంట్రిక్‌గా ఓ ప్రాజెక్టును తీర్చిదిద్దుతున్నారు. సన్నీ డియోల్ లుక్, ఫిజిక్, స్క్రీన్ ప్రజెన్స్ దృష్టిలో పెట్టుకుని హనుమంతుడి పాత్రకు ఆయనైతే కరెక్ట్ అని ‘రామాయణ’లో తీసుకున్నారు. ఇప్పుడు ఆయనే ప్రధానంగా ‘హనుమాన్’ చేస్తారని చిత్రబృందం సన్నిహితులు బాలీవుడ్ మీడియాకు తెలియజేశారు.
ఈ సినిమాకు సంబంధించి త్వరలో అధికారిక ప్రకటన వస్తుంది అని సమాచారం. ప్రస్తుతం సన్నీ.. ‘బోర్డర్ 2’ సినిమాలో నటిస్తున్నారు. దీని తర్వాత ‘జాట్ 2’ ఉంటుందని సమాచారం. అదయ్యాక ‘హనుమాన్’లో నటిస్తారట. ఈలోపు నితీశ్ తివారీ తన రెండు ‘రామాయణ’ సినిమాలు పూర్తి చేస్తారట. తొలి ‘రామాయణ’ వచ్చే ఏడాది దీపావళికి.. రెండో ‘రామాయణ’ ఆ తర్వాత ఏడాది దీపావళికి తీసుకొస్తారని టాక్. ఇక ఈ సినిమాకు సుమారు రూ. 4000 కోట్లు బడ్జెట్‌గా పెట్టారని ఓ టాక్. అంతెందుకు అవుతుంది అనేగా డౌట్. రెండు పార్టులు అంత పెద్ద కాస్టింగ్, కాన్వాస్‌కి ఆ మాత్రం అవుతాయని అంటున్నారు.