ప్రముఖ నటుడు మురళీ మోహన్ ఈ మధ్య కాలంలో సినిమాలలో ఎక్కువగా నటించడం లేదనే సంగతి తెలిసిందే. కొన్నేళ్ల పాటు రాజకీయాల్లో బిజీగా ఉన్న మురళీ మోహన్ కు ప్రస్తుతం రాజకీయాలకు కూడా దూరంగానే ఉంటున్నారు. అయితే హెచ్‌ఎండీఏ రూల్స్ ను అతిక్రమించారనే కేసులో మురళీమోహన్ కు చెందిన జయభేరి కన్‌స్ట్రక్షన్స్‌కు ఎదురుదెబ్బ తగలడం గమనార్హం. సర్వోన్నత న్యాయస్థానం మురళీమోహన్ కు వ్యతిరేకంగా తీర్పు చెప్పింది. హైదరాబాద్ లోని కొండాపూర్ ప్రాంతానికి చెందిన మధుసూదన్ అనే వ్యక్తి జయభేరి సంస్థ నుంచి ఫ్లాట్ ను కొనుగోలు చేశాడు.
అయితే ఈ ఫ్లాట్ కొనుగోలు విషయంలో జయభేరి సంస్థ అవకతవకలకు పాల్పడిందని కొనుగోలుదారుడు సుప్రీం కోర్టును ఆశ్రయించాడు. కొనుగోలుదారుడికి అనుకూలంగా సుప్రీం కోర్టు తీర్పునివ్వడం గమనార్హం. ఈ కేసులో కోర్టు నుంచి మురళీమోహన్ కు సమన్లు వచ్చాయని సమాచారం. మురళీ మోహన్ సుప్రీం కోర్టు తీర్పు విషయంలో ఏ విధంగా ముందుకెళతారో చూడాల్సి ఉంది. మురళీ మోహన్ పలు సినిమాలకు నిర్మాతగా కూడా వ్యవహరించారు.
కొన్ని రోజుల క్రితం మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ వివాదం గురించి స్పందించి మురళీ మోహన్ వార్తల్లో నిలిచారు. మా ఎన్నికలు ఏకగ్రీవం అయ్యేలా చూస్తామని మురళీ మోహన్ షాకింగ్ కామెంట్లు చేసిన సంగతి తెలిసింది. ఇండస్ట్రీ పెద్దలు సైతం ఎన్నికలను ఏకగ్రీవం చేయాలనే ఆలోచన చేస్తున్నారు. సెప్టెంబర్ లో మా ఎన్నికలు జరగనుండగా ఈ ఎన్నికలు ఏకగ్రీవం అవుతాయో లేదో చూడాల్సి ఉంది.