‘బాహుబలి’ చిత్రంతో హీరో ప్రభాస్ ఏ రేంజ్లో ఫేమస్ అయ్యాడో… విలన్ రానా కూడా అదే రేంజ్లో పాపులర్ అయ్యాడు. కేవలం సౌత్ లోనే కాకుండా దేశవ్యాప్తంగా రానా అభిమానులను సంపాదించుకున్నాడు. దాదాపు అన్ని భాషల్లోనూ సినిమాలు చేస్తూ రానా దూసుకుపోతున్నాడు. అందం, హైట్, బాడీ ఇలా రానా తన కటువుట్ తో మెస్మరైజ్ చేస్తుంటాడు. డబ్బు కి, క్రేజ్ కు ఏమాత్రం లోటు లేదు. కానీ ఆయనకి ఒకటే లోటు. అదే ఆయన కంటి చూపు. ‘మేము సైతం’ షో లో స్వయంగా రానానే ఈ విషయాన్నీ తెలిపాడు.
‘తనకు చిన్నప్పుడే కంటి సమస్య వస్తే.. కన్ను తీసేసి మరోకన్ను పెట్టారని.. అయితే ఆ కంటికి చూపు మాత్రం లేదు’ అంటూ రానా చెప్పుకొచ్చాడు. ఇప్పుడు ఈ విషయాలను అతడి తండ్రి, ప్రముఖ నిర్మాత దగ్గుబాటి సురేష్ బాబు కూడా చెప్పుకొచ్చాడు. సురేష్ బాబు మాట్లాడుతూ.. “నా కొడుకును స్పోర్ట్స్ మ్యాన్ ను చేయాలనుకున్నాను. కానీ అది సాధ్యం కాలేదు. నాకు క్రీడల పై ఉన్న ఇష్టంతో రానాని స్పోర్ట్స్ మ్యాన్ ను చేయలనుకున్నాను. ఈ క్రమంలో ముందుగా రానాను ‘ఆర్చరీ’లో చేర్చగా.. అతడు బాణాన్ని గురిచూసి కొట్టలేకపోయాడు. ఆ తరువాత క్రికెట్ లో చేర్పిస్తే.. బంతిని క్యాచ్ చేయడంలో ఇబ్బంది పడ్డాడు. దీంతో కొన్ని పరీక్షలు చేయిస్తే.. తనకి కంటి సమస్య ఉందని వైద్యులు చెప్పారు. దీంతో రానాని క్రీడల్లోకి పంపే ఆలోచన మానుకున్నాను. కొన్నాళ్ళ తరువాత రానా సినిమాల పై ఆసక్తి పెంచుకొని ఈ రంగం వైపు వచ్చాడు. కానీ రానాకి క్రికెట్ అంటే ఇప్పటికీ చాలా ఇష్టం. ఈ కంటి సమస్య కారణంగా రానా ఇప్పటికీ ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటున్నాడు” అంటూ తన బాధని వ్యక్తం చేసారు సురేష్ బాబు.