‘కంగువ’ (Kanguva) సినిమా వచ్చేంతవరకు సూర్యను భలే చూపించారు అని అనుకున్నారంతా. అందులో ఫ్యాన్స్, ప్రేక్షకులు కూడా ఉన్నారు. అయితే ఆ సినిమా వచ్చాక ఎంత త్వరగా మరచిపోతే అంత బెటర్ అని అనుకున్నారు. మరోవైపు సూర్య (Suriya) కూడా ఆ సినిమా గాయాన్ని మాన్చేలా కొత్త సినిమాల వేగం పెంచాడు. ఈ క్రమంలో కార్తిక్ సుబ్బరాజు (Karthik Subbaraj) దర్శకత్వంలో ‘రెట్రో’గా తెరకెక్కుతున్న సినిమా టీజర్‌ను రిలీజ్ చేశారు. కార్తిక్ సుబ్బరాజ్ సినిమా అంటే రెగ్యులర్ మూవీ కాదు అని చెప్పేయొచ్చు.
ఈ క్రమంలోనే సూర్య సినిమా కూడా యాక్షన్‌తో నిండిపోయి ఉంటుంది అని అందరూ అనుకున్నారు. దానికి కాస్త రొమాంటిక్ టచ్ ఇచ్చి ‘రెట్రో’ను (Retro) తెరకెక్కించారు. పూజా హెగ్డే (Pooja Hegde) కథానాయికగా నటిస్తున్న ఈ సినిమా టీజర్‌ను వాళ్లిద్దరి మీదే నడిపించారు. ప్రియురాలికి మాట ఇచ్చి, పెళ్లి చేసుకుందామని హీరో చెప్పే సన్నివేశమే టీజర్. గ్యాంగ్‌స్టర్ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమాలో యాక్షన్, ప్రేమ, భావోద్వేగాలు పూర్తి స్థాయిలో ఉంటాయి అని టీజర్ చూస్తే అర్థమవుతోంది.
గ్యాంగ్‌స్టర్‌గా అనుకోని పరిస్థితుల్లో మారిన హీరో ఆ హింసా మార్గం నుండి బయటకొచ్చి కొత్త జీవితాన్ని ప్రారంభిస్తానని ప్రేయసి ఎమోషనల్‌గా చెబుతుఉంటాడు. అయితే నేరాలతో నిండిపోయిన గత చరిత్ర తాలూకు మరకలు వెంటాడాయా? అదే జరిగితే ఏం చేశాడు అనేదే సినిమా కథ అని అర్థమవుతోంది. ఇలాంటి కథలు మనం ఎన్నో చూసి ఉన్నా.. విజువల్స్, షేడ్స్ కొత్తగా కనిపిస్తున్నాయి. దానికి కార్తిక్ సుబ్బరాజ్ ఇంటెన్స్ టేకింగ్ యాడ్ అయితే సినిమా వేరే లెవల్‌లో ఉంటుంది అని చెప్పొచ్చు. ఇక టీజర్ విషయానికొస్తే సంతోష్ నారాయణన్ (Santhosh Narayanan) బ్యాగ్రౌండ్ స్కోర్ అదిరిపోయింది అని చెప్పాలి.
హోమ్లీ లుక్‌లో పూజా హెగ్డే కొత్తగా ఉంది. అయితే ఓ ఫ్రేమ్ అస్సలు బాలేదు. సినిమా రిలీజ్ సంగతి చూస్తే.. 2025 వేసవిలో విడుదల చేయనున్నారు. ఇక్కడో విషయం చెప్పాలి.. మామూలుగా మన సినిమాల టీజర్‌లు రెండు నిమిషాల లోపు, ఒక్కోసారి ఒకటిన్నర నిమిషం లోపే తేల్చేస్తారు. కానీ ఈ టీజర్ రెండు నిమిషాలు దాటింది. ఫైనల్‌గా ఇందులో డైలాగ్ గురించి చెప్పుకోవాలి. ‘‘తండ్రి బాటలో నడవను, హింసను వదిలేస్తా, హత్యలు చేయను. రౌడీయిజం పూర్తిగా మానేస్తాను. పెళ్లి చేసుకుంటావా’’ అని అడుగుతాడు. ఇందులో పెద్దే కథే ఉంది.