కేసుల కష్టాలు దాటుకొని అధ్యక్షురాలు అయిన హీరోయిన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

మలయాళ సినిమా పరిశ్రమలో కొత్త శతం మొదలైంది. మాలీవుడ్‌ సినిమా నటుల సంఘం.. అసోసియేషన్‌ ఆఫ్‌ మలయాళం మూవీ ఆర్టిస్ట్స్‌ (అమ్మ) అధ్యక్షురాలిగా ప్రముఖ నటి శ్వేతా మీనన్‌ ఎన్నికైంది. ప్రత్యర్థి దేవన్‌పై గెలిచి ‘అమ్మ’ ప్రెసిడెంట్‌గా ఎన్నికైన తొలి నటిగా రికార్డు నెలకొల్పింది. ఇక ఈ ఎన్నికల్లో ఉపాధ్యక్షురాలిగా లక్ష్మీ ప్రియ, జాయింట్‌ సెక్రటరీగా కుక్కు పరమేశ్వరన్‌, జనరల్‌ సెక్రటరీగా అన్సిబా హాసన్‌ ఎన్నికయ్యారు. అమ్మలో 506 మంది సభ్యులకు ఓటు హక్కు ఉండగా 298 మంది ఓటేశారు.

Swetha Menon

శ్వేతా మీనన్‌పై ఇటీవల ఓ పోలీస్ కేసు నమోదైంది. అశ్లీల చిత్రాల పంపిణీ చేస్తూ ఆమె డబ్బు సంపాదిస్తోందని ఎర్నాకులం పోలీసులకు ఫిర్యాదు వచ్చింది. మార్టిన్ మోనాచేరి అనే పబ్లిక్ ప్రాసిక్యూటర్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీంతో సెక్షన్ 67A కింద శ్వేతా మీనన్‌పై పోలీస్ స్టేషన్‌లో నమోదు చేశారు. ఈ నేపథ్యంలో ఈ ఎన్నికల్లో శ్వేత మీనన్‌ గెలుస్తారా లేదా అనే అనుమానం ఉండేది. కానీ ఇప్పుడు ఆమె మంచి మెజారిటీతో గెలుపొందటం గమనార్హం.

కొంతమంది నటీమణులు పరిశ్రమలో నటులపై లైంగిక ఆరోపణలు చేసిన నేపథ్యంలో ‘అమ్మ’ అధ్యక్ష పదవికి అగ్ర కథానాయకుడు మోహన్‌ లాల్‌ గతేడాది రాజీనామా చేశారు. 2027లో నిర్వహించాల్సిన అమ్మ ఎన్నికలను ఈ నేపథ్యంలో ఈ ఏడాదే నిర్వహించారు. మరి ఈ ఎన్నికల్లో విజయం సాధించిన శ్వేతా మీనన్‌ ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో చూడాలి. ఎందుకంటే మాలీవుడ్‌ మీద గత కొన్ని నెలలుగా మాయని మచ్చలు చాలానే పడ్డాయి. కాస్టింగ్‌ కౌచ్‌, లైంగిక వేధింపులు, డ్రగ్స్‌ వినియోగం ఇలా చాలానే ఆరోపణలు వచ్చాయి.

మరిప్పుడు శ్వేతా మీనన్‌ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు. ఇలాంటి పరిస్థితుల్ని ఎలా హ్యాండిల్‌ చేస్తారు అనేది చూడాలి. ఇక ఈ విషయంలో మలయాళ సీనియర్‌ నటుల నుండి ఎలాంటి స్పందన వస్తుంది అనేది కూడా ఇక్కడ ఆసక్తికరం.

‘షోలే’ విజయం ఎవరూ ఊహించలేదు.. రికార్డులు అస్సలు ఊహించలేదు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus