తాజాగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన 67 వ జాతీయ అవార్డుల విషయం పై పెద్ద చర్చే జరుగుతుంది. 2019 వ సంవత్సరానికి గాను ఈ అవార్డులను ప్రకటించడం జరిగింది. ‘జెర్సీ’ ‘మహర్షి’ చిత్రాలను నేషనల్ అవార్డులు వరించాయి.’హోల్ సమ్ ఎంటర్టైనర్’ మరియు ‘కొరియోగ్రఫీ’ కేటగిరిల్లో ‘మహర్షి’ చిత్రానికి 2 నేషనల్ అవార్డులు దక్కాయి. ఇక ‘జెర్సీ’ చిత్రానికి కూడా ‘బెస్ట్ తెలుగు ఫిలిం’ మరియు ఎడిటింగ్ విభాగాల్లో అవార్డులు దక్కాయి. అయితే ‘జెర్సీ’ వరకూ బాగానే అనిపించినా… ‘మహర్షి’ చిత్రానికి అవార్డు ఇవ్వడం పట్ల భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
దీంతో నేషనల్ అవార్డుల విషయంలో కూడా ఏమైనా అవకతవకలు జరిగాయా.. నచ్చిన వాళ్ళకే అవార్డులు ఇచ్చారా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. సరే.. ఇక అసలు విషయానికి వద్దాం.. 2019 లో చాలా హిట్ సినిమాలు వచ్చాయి. నేషనల్ అవార్డ్స్ అనేవి బాక్సాఫీస్ రిజల్ట్ ను బట్టి కాదు.. కంటెంట్ ను ఆధారం చేసుకునే ఇస్తారు అనుకుందాం. అలాంటప్పుడు ‘మల్లేశం’ ‘సైరా’ నరసింహారెడ్డి’ వంటి చిత్రాలకు ఎందుకు అవార్డు ఇవ్వలేదు. ‘మల్లేశం’ అనేది చిన్న సినిమా కాబట్టి.. దర్శకనిర్మాతలే అప్లై చెయ్యలేదా అనేది స్పష్టత లేదు. అయితే ‘సైరా’ పాన్ ఇండియా స్థాయిలో విడుదలయ్యింది.
అన్ని చోట్లా సినిమాకి మంచి స్పందన లభించింది. మరి ఆ చిత్రానికి అవార్డు రాకపోవడం నిజంగా విచారించదగ్గ విషయమే. అంతేకాదు ‘బ్రోచేవారెవరురా’ ‘ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ’ ‘యాత్ర’ ‘ఎవ్వరికీ చెప్పొద్దు’ వంటి చిత్రాలు కూడా మంచి కథాంశంతోనూ.. సరికొత్త స్క్రీన్ ప్లే తో రూపొందినవే. ఇలాంటి చిత్రాలను కూడా నేషనల్ అవార్డ్స్ కమిటీ పట్టించుకోకపోవడం ఆలోచించదగ్గ విషయం.