ఒకప్పుడు కొన్ని తమిళ సినిమాలు చూస్తే.. ‘అబ్బా.. మన తెలుగు దర్శకులు కూడా వీరిలా మారి సినిమాలు చేస్తే ఎంత బాగుంటుంది?’ అనిపించేది. వాళ్ళ విజన్, రైటింగ్ చాలా అడ్వాన్స్డ్ గా అనిపించేది. ఈ లిస్టులో ముందుగా శంకర్ గురించి చెప్పుకోవాలి. ఈయన్ని ఒకానొక టైంలో ‘ఇండియన్ జేమ్స్ కామరూన్’ అనే వారు. ఆయన విజన్ చాలా బాగుండేది. చాలా అడ్వాన్స్డ్ కాన్సెప్ట్స్ తో సినిమాలు చేసేవారు.
కొన్ని సార్లు పాత కథలు తీసుకున్నా.. టెక్నికల్ గా నెక్స్ట్ లెవెల్లో ఉండేవి. ఇలాంటి దర్శకుడు నుండి ‘ఐ’ ‘ఇండియన్ 2’ ‘గేమ్ ఛేంజర్’ వంటి సినిమాలు వస్తాయని ఎవరూ కలలో కూడా ఊహించి ఉండరు. ఇక శంకర్ కంటే ముందుగా మణిరత్నం లెజెండరీ స్టేటస్ సంపాదించుకున్నారు. ఆయన సినిమాలు.. ఆయన విజన్ నెక్స్ట్ లెవెల్లో ఉండేవి. డైలాగులు అయితే సహజంగా ఉంటూనే ఎమోషనల్ అయ్యేలా చేసేవి.
అలాంటి దర్శకుడు ‘థగ్ లైఫ్’ వంటి సినిమాలు ఇస్తాడని ఎవరూ ఊహించి ఉండరు. ‘పొన్నియన్ సెల్వన్’ కూడా హైప్ మీటర్ పై వెళ్లిన సినిమానే అని ‘థగ్ లైఫ్’ తో ప్రూవ్ అయ్యింది. ఇప్పుడు మణిరత్నంతో సినిమాలు చేయడానికి తమిళ హీరోలు కూడా భయపడే పరిస్థితి ఏర్పడింది.
ఇక వీరి తర్వాత మురుగదాస్ గురించి చెప్పుకోవాలి. సోషల్ మెసేజ్ ఉన్న కథలు, యాక్షన్ కథలు మాస్ ఆడియన్స్ కి కూడా నచ్చే విధంగా తీయడం ఆయన స్టైల్. ‘రమణ’ ‘గజినీ’ ‘తుపాకీ’ ‘కత్తి’ వంటి సినిమాలతో ట్రెండ్ సెట్టర్ గా నిలిచారు. దాదాపు కెరీర్ ముగిసింది అనుకున్న విజయ్ వంటి హీరోకి తిరిగి పూర్వ వైభవం తీసుకొచ్చిన ఘనత మురుగదాస్ సొంతం. అలాంటి దర్శకుడు నుండి ‘స్పైడర్’ ‘దర్బార్’ ‘సికందర్’ ఇప్పుడు ‘మదరాసి’ వంటి నాసిరకం సినిమాలు వస్తాయని కలలో కూడా ఊహించలేదు. ఇక వెట్రిమారన్ విషయానికి వస్తే.. ‘విడుదలై’ వరకు ఆయన టాప్ ప్లేస్ లో ఉండేవారు. ఇప్పుడు ఆయన కూడా ఫామ్ కోల్పోయారు. చూస్తుంటే తమిళ స్టార్ డైరెక్టర్స్ ఆల్మోస్ట్ దుకాణం సర్దేసినట్టే కనిపిస్తుంది.