రచయిత, నటుడు, దర్శకుడు.. ఇలా ఆల్‌రౌండర్‌గా టాలీవుడ్‌లో ఎప్పుడూ బిజీగా ఉండే తనికెళ్ల భరణి మరోసారి మెగా ఫోన్ పట్టడానికి సిద్ధమవుతున్నారు. వెరైటీ స్క్రిప్ట్‌తో, అంతకంటే వెరైటీ టైటిల్‌తో ఓ సినిమాను తెరకెక్కించే పనిలో ఉన్నారట. ‘మిథునం’ సినిమాతో ఇప్పటికే దర్శకుడిగా తనెంత గొప్ప దర్శకుడో నిరూపించారు. అలాంటి ఆయన ‘చిలకలగూడ రైల్వే క్వార్టర్ 221/1’ అనే సినిమా చేయబోతున్నారట. పేరు బాగుంది కదా.. సినిమా కథ కూడా ఇంకా బాగుంటుంది అని చెబుతున్నారు.
తనికెళ్ల భరణి గొప్ప నటుడు మాత్రమేకాదు, ‘లేడీస్ టైలర్’, ‘మహర్షి’, ‘శివ’, ‘నారీ నారీ నడుమ మురారి’, ‘మనీ మనీ’ లాంటి అదిరిపోయే సినిమాలు రాసిన రచయిత కూడా. ‘మిథునం’ సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆ సినిమా చేసిన పదేళ్ల తర్వాత మళ్లీ మెగాఫోన్ పట్టడానికి రెడీ అవుతున్నారు. బాల్య జ్ఞాపకాల నేపథ్యంలో ‘చిలకలగూడ రైల్వే క్వార్టర్ 221/1’ అనే సినిమా తెరకెక్కించనున్నట్లు ఇటీవల ప్రకటించారు. అంతే కాదు ఈ టైటిల్ వెనుక ఓ కథ ఉందని కూడా చెప్పారు.
తనికెళ్ల భరణి (Tanikella Bharani) తండ్రి రైల్వే ఉద్యోగి. అందువల్ల ఆయన బాల్యంలో కొన్ని రోజులు చిలకలగూడ ప్రాంతంలో ఉన్నారట. అక్కడి క్వార్టర్స్‌లోని 221/1 క్వార్టర్‌లో ఆయన ఉండేవారట. అందుకే ఆ ఇంటి పేరుతో సినిమా తీయాలని ఉందని తన మనసులో మాటను బయట పెట్టారు. దక్షిణ మధ్య రైల్వే కళా సమితి ఆధ్వర్యంలో ఇటీవల జరిగిన ఉగాది పురస్కారాల ప్రదానోత్సవ కార్యక్రమంలో ఈ మేరకు చెప్పారు తనికెళ్ల భరణి.
రైల్ నిలయం నిర్మాణం తన కళ్ల ముందు జరిగిందని గుర్తు చేసుకున్న ఆయన.. దేశం మొత్తం మూడుసార్లు తిరిగాను అని చెప్పారు. అయితే, ఈ సినిమా ఎప్పుడు మొదలవుతుంది, ఎవరు నటిస్తారు లాంటి విషయాలు ఏవీ చెప్పలేదు. అయితే ఈ సినిమా సరికొత్తగా ఉండబోతోంది, నాటి విషయాల్ని తిరిగి గుర్తు చేయబోతోంది అనే మాట మాత్రం చెప్పొచ్చు.