టాలీవుడ్ సీనియర్ స్టార్ యాక్టర్స్ లిస్ట్ లో తనికెళ్ళ భరణి పేరు కూడా ఉంటుంది అనడంలో అతిశయోక్తి ఉండదు. ఆయన దాదాపు 800 సినిమాల్లో నటించారు. నటుడిగానే కాకుండా రైటర్ గా కూడా ఎన్నో సినిమాలకి పనిచేశారు. గతేడాది చివర్లో వచ్చిన ‘పొన్నియన్ సెల్వన్’ సిరీస్ కి ఈయనే డైలాగ్స్ అందించారు అనే సంగతి తెలిసిందే. రంగస్థల నటుడిగా కెరీర్ ను ప్రారంభించిన ఈయన ఎటువంటి పాత్రనైనా అలవోకగా చేసేస్తాడు.
‘శివ’ సినిమాలో చేసిన పాత్రైనా, ‘మన్మధుడు’ లోని సపోర్టింగ్ రోల్ అయినా, ‘మని మని’ లో పాత్రైనా , ‘అతడు’ లో చేసిన నాయుడు పాత్రైనా.. ఇలా ఆయన చేసినవి దేనికవే ప్రత్యేకమైనవి అని చెప్పాలి. అయితే తండ్రి, మామగారు, బాబాయ్ వంటి పాత్రలకి కూడా ఈయన పెట్టింది పేరు. అయితే ఈ మధ్య ఈయనకి తండ్రీ పాత్రలంటే అస్సలు నచ్చడం లేదట. గత 4 ,5 ఏళ్లలో ఆయన 200 కి పైగా సినిమాల్లో తండ్రి పాత్రలు రిజెక్ట్ (Tanikella Bharani) చేశారట.
ఎందుకంటే .. దానికి కారణం కూడా చెప్పుకొచ్చాడు. ‘ఈ మధ్య కాలంలో తండ్రి పాత్ర అంటే కొత్తగా ఏమీ ఉండటం లేదు. అయితే ప్రేమిస్తే చంపేస్తాను అనేలా ఉంటుంది. లేదు అంటే మీ అమ్మని నేను ఎలా పడేసానో తెలుసా అని చెప్పి.. హీరో పాత్రని లవ్ ట్రాక్ ఎక్కించే విధంగా ఉంటుంది. అందుకే ఆ పాత్రల జోలికి నేను పోవడం లేదు’ అంటూ ఆయన చెప్పుకొచ్చారు.