తెలుగు సినిమా చరిత్రలో ‘మాతృదేవోభవ’ సినిమా అద్భుతమనే చెప్పాలి. 1991లో విడుదలైన ఈ సినిమా ఇప్పటికి టీవీల్లో వచ్చినా ప్రేక్షకులు చూస్తూనే ఉంటారు. అంతగా ఇంపాక్ట్ చూపించిన సినిమా. ఈ సినిమాలో ఎమోషన్స్ కి కంటతడి పెట్టని ప్రేక్షకుడు ఉండడు. మాధవి, నాజర్ ప్రధాన పాత్రలో పోషించిన ఈ సినిమాలో తనికెళ్ల భరణి విలన్ గా నటించారు. కథ ప్రకారం తనికెళ్ల భరణి.. నాజర్ క్యారెక్టర్ ను చంపేస్తారు. అయితే ఈ సినిమా కారణంగా తనకు నిజ జీవితంలో ఎదుర్కొన్న అనుభవాల గురించి పంచుకున్నారు తనికెళ్ల భరణి. ఆయన మాటల్లో.. ”మాతృదేవోభవ’ సినిమాలో నాజర్ మంచివాడిగా మారిన తరువాత అతడిని పొడిచి చంపేస్తాను.
ఆ సీన్ జనాల్లో ఎంత ప్రభావం చూపించిందంటే.. కృష్ణదేవర నగర్ లో నేను బయట కూర్చొని పేపర్ చదువుతుంటే.. కూరగాయలు అమ్మే ఆవిడ వచ్చింది. నన్ను కోపంగా చూస్తూ.. ‘ఏం సారూ ఆయన్ని అట్టా చంపేశారు’ అని అడిగింది. సినిమానే కదా అని బదులిస్తే.. అయితే మాత్రం అన్ని సార్లు పొడుస్తావా అంటూ నిలదీసింది. నిజంగా ఆ పాత్ర చూస్తే నా మీద నాకే కోపం వస్తుంది. దీన్ని బట్టి ఆ పాత్ర ఎంత గొప్పగా పండిందో అర్ధం చేసుకోవచ్చు.
ఇంకోసారి అవుట్ డోర్ షూటింగ్ కు వెళ్లినప్పుడు ఈ వెధవ మా ఊరు ఎందుకు వచ్చాడంటూ ఆడవాళ్లంతా బూతులు తిట్టారని” చెప్పుకొచ్చారు తనికెళ్ల భరణి. అలానే ‘ఆమె’ అనే సినిమాలో మరదల్ని వేధించే పాత్ర పోషించినట్లు చెప్పిన తనికెళ్ల భరణి.. ఆ సినిమాకి తన భార్య, మరదలితో కలిసి వెళ్లాలని చెప్పారు. అయితే సినిమా చూసిన తరువాత అప్పటివరకు తనను ఎంతో గౌరవంగా చూసిన తన మరదలు ఏదోలా చూసేదని చెప్పుకొచ్చారు. సినిమాల వలన అంత ప్రభావం ఉంటుందని చెప్పడానికి ఇవే ప్రత్యక్ష ఉదాహరణలు అంటూ చెప్పుకొచ్చారు.