అందం, అభినయం ఉన్నా సరైన సినిమాలు దక్కించుకోలేకపోతోంది.. పాయల్ రాజ్‌పూత్ గురించి చర్చ వచ్చినప్పుడల్లా ఈ మాటలు కచ్చితంగా వినిపిస్తాయి. తొలి సినిమా ‘ఆర్‌ఎక్స్ 100’తోనే నటనకు ప్రాధాన్యమున్న పాత్ర చేసినా.. ఆ తర్వాత ఆ ఫ్లోని కొనసాగించలేకపోయింది. దీంతో ‘ఏంటి పాయల్ ఇలా చేస్తోంది’ అనుకున్నారు అభిమానులు. అయితే దీని వెనుక ఉన్న కారణాల గురించి పాయల్ ఇటీవల మాట్లాడింది. దీంతో ఆమె మాటలు మరోసారి కీలక చర్చకు దారితీశాయి.
సినిమా ఇండస్ట్రీలో కథానాయికల్ని మేనేజర్లు తప్పుదోవ పట్టిస్తుంటారు. దీంతో నాయికలు చాలా లాస్ అవుతుంటారు అని చాలాసార్లు విన్నాం. దీనిపై ఎప్పటికప్పుడు చర్చ జరుగుతూ ఉన్నా ఎక్కడా మార్పు రావడం లేదు. తాజాగా పాయల్ రాజ్‌పూత్ కూడా ఇదే మాట అంటోంది. ‘ఆర్‌ఎక్స్ 100’ సుమారు రూ. 2 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కించిన చిత్రం. బాక్సాఫీసు దగ్గర రూ. 30 కోట్లు వసూలు చేసింది. ఆ సినిమాతో నటిగా నాకూ మంచి గుర్తింపు వచ్చింది అని చెప్పింది పాయల్ రాజ్‌పూత్.
అయితే ఆ తర్వాత, తన మేనేజర్‌తోపాటు కొంతమంది తనను తప్పు దారి పట్టించారని చెప్పుకొచ్చింది పాయల్. దీంతో కొన్ని సినిమాలు స్క్రిప్టు వినకుండానే నటించానని, దాంతో కెరీర్‌లో ఇబ్బంది పడ్డానని చెప్పుకొచ్చింది. దీంతో విషయం అర్థమై ఇప్పుడు కథ నచ్చితేనే అందులో నటించేందుకు ఇష్టపడుతున్నా అని చెప్పింది పాయల్. ఇకపై ఇలానే కొనసాగాలని అనుకుంటున్నాను. కెరీర్‌లో మంచి సినిమాలు చేయాలనుకుంటున్నాను అని క్లారిటీ ఇచ్చింది.
పాయల్ రాజ్‌పూత్ లాంటి కొత్త నటి ఇలా చెప్పడం కొత్తేమీ కాదు. ముందుగా చెప్పినట్లు గతంలోనూ కొంతమంది హీరోయిన్లు ఇలా చెప్పుకొచ్చారు. అయినప్పటికీ చుట్టూ ఉండే మనుషుల మాటలు విని ఇబ్బందిపడుతున్నారు. పాయల్ కథ విన్నాక అయినా హీరోయిన్లు ఆలోచిస్తారేమో చూడాలి. ఇక పాయల్ నెక్స్ట్ సినిమాలు చూస్తే.. ‘హెడ్ బుష్’ అనే కన్నడ సినిమా, ‘గోల్‌మాల్’ అనే తమిళ సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. ఇది కాకుండా ‘మాయా పేటిక’ అనే సినిమా కూడా ఉంది.