సినిమా సెట్స్ మీద ఉండగానే మరో సినిమా కథను ఓకే చేయడానికే మన హీరోలు నానా బాధలు పడుతున్నారు. ఎప్పుడో కానీ రెండు సినిమాలు ఒకేసారి సెట్ మీద ఉండటం లేదు. ఒకవేళ ఉన్నా అందులో ఒకటి మాత్రమే షూటింగ్ జరుపుకుంటూ ఉంటుంది. దీంతో చాలాసార్లు కాస్త సినిమాల వేగం పెంచండయ్యా.. వరుస సినిమాలు షూట్ చేయండయ్యా అని ఫ్యాన్స్ అడుగుతుంటారు. ఈ మాటలు వింటారో, లేక వాళ్లకే అనిపిస్తుందో కానీ..
కొంతమంది హీరోలు మారారు. మరికొంతమంది ఇంకా అలానే ఉన్నారు. అయితే వాళ్లు ప్రముఖ తమిళ హీరో ధనుష్‌ను (Dhanush) చూసి నేర్చుకోవాలి అంటే బాధపడొచ్చు కానీ ఇదే నిజం అని చెప్పాలి. ఎందుకంటే ఆయన చేతిలో ఇప్పుడు మూడు సినిమాలు ఉన్నాయి. అన్నీ షూటింగ్ దశలోనే ఉన్నాయి. ఈలోపు కొత్త సినిమా మరొకటి అనౌన్స్ చేశారు. ఇంకో సినిమా చర్చల దశలో ఉంది. ‘కర్ణన్’ సినిమాతో హిట్ కాంబినేషన్ అనిపించుకున్న దర్శకుడు మారి సెల్వరాజ్ – ధనుష్ మరోసారి కలిశారు.
అదే కలయికలో కొత్త సినిమా రాబోతుంది. ఈ సినిమాను ఇటీవల అధికారికంగా ప్రకటించారు. మూలాలు గొప్ప యుద్ధాన్ని ప్రారంభిస్తాయి అంటూ సినిమా కథను కాస్త ఊరించి చెప్పారు. ఇక ధనుష్ లైనప్ గురించి చూస్తే.. శేఖర్ కమ్ములతో ‘కుబేర’ (Kubera) సినిమా చేస్తున్నారు. ఈ సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. ఇక సొంత డైరక్షన్‌లో ‘ఇడ్లీ కడై’ (Idly Kadai) అనే సినిమా చేస్తున్నారు. ఆ సినిమా అక్టోబరులో రిలీజ్ చేస్తారు.
ఇక హిందీలో ‘తేరే ఇష్క్ మే’ అనే సినిమాలో నటిస్తున్నారు. సెల్వరాజ్ సినిమా గురించి పైన చదివే ఉంటారు. ఇది కాకుండా శేఖర్ కమ్ములతో (Sekhar Kammula) మరో సినిమా ఓకే చేశారు అని టాక్. ఇదంతా చూస్తుంటే వరుస సినిమాలు చేస్తున్నారు. మరి మన హీరోలు ఇలా ఎప్పుడు చేస్తారో? ఇలా అంటే సినిమాలు వరుసగా షూటింగ్‌లో ఉండాలి అని. అనౌన్స్ చేసి వదిలేయడం కాదు.