ఇటీవల సెట్లో ఓవరాక్షన్ చేశాడని బుల్లితెర నటుడు, హీరో అయిన చందన్ కుమార్ పై ఓ టెక్నీషియన్ చెయ్యి చేసుకున్న సంగతి తెలిసిందే. ఆ టెక్నీషియన్ కు యూనిట్ సభ్యులు అంతా మద్దతు పలికి అండగా నిలబడడంతో ఈ హీరోకి చుక్కలు కనిపించాయి. తాజాగా ఇతనికి మరో షాక్ తగిలింది. ఆ గొడవ ముగిసాక చందన్ కన్నడ మీడియా ముందు తెలుగు పరిశ్రమని తక్కువ చేసి, అసత్యాలు ప్రచారం చేస్తూ, తెలుగు బుల్లితెరని కించపరుస్తూ మాట్లాడాడు.
దీంతో అతను తెలుగు సీరియల్స్ మరియు సినిమాల్లో నటించకుండా … తెలుగు టీవీ ఫెడరేషన్ సంస్థ బ్యాన్ విధించింది. ఈ సమావేశంలో భాగంగా బాధితుడు, అసిస్టెంట్ డైరెక్టర్ మాట్లాడుతూ.. ‘షాట్ రెడీ అని నాలుగు సార్లు పిలిచాను, అయినా రాకుండా నన్ను కొట్టి, బూతులు తిట్టాడు. డైరెక్టర్‌కి కంప్లైంట్ చేస్తే, బయటకి రా… దమ్ముంటే నేనెంటో చూపిస్తానంటూ బెదిరించాడు’ అని తెలిపాడు.నా తల్లిని ఉద్దేశించి అతను దుర్భాషలాడాడు’ అంటూ చెప్పుకొచ్చాడు.
చందన్ తీరును క్షమించరానిదిగా పరిగణించి తెలుగు టీవీ ఫెడరేషన్ చందన్‌ని అతన్ని బ్యాన్ చేస్తున్నట్లు ప్రకటించి అతని పై మరో దెబ్బ పడేలా చేసింది. ‘సావిత్రమ్మ గారి అబ్బాయి’ వంటి సీరియల్స్ లో మాత్రమే కాకుండా పలు సినిమాల్లో కూడా నటించాడు చందన్. యాక్షన్ కింగ్ అర్జున్ కూతురు ఐశ్వర్యతో ‘ప్రేమ బరహా’ అనే చిత్రంలో నటించాడు.
ఈ మూవీలో అతను హీరోగా నటించడం విశేషం. హీరోగా క్లిక్ అవ్వకపోవడంతో పలు కన్నడ సీరియల్స్ లో నటించి క్రేజ్ సంపాదించుకున్న చందన్.. ‘రాధా కళ్యాణ’, ‘లక్ష్మీ బారమ్మ’ వంటి కన్నడ సీరియల్స్ తో మంచి ఇమేజ్ ను సొంతం చేసుకున్నాడు. కొన్నాళ్ల పాటు అతను తెలుగు సీరియల్స్ లో నటించే అవకాశాలు అయితే ఇప్పట్లో లేవనే చెప్పాలి.