తెలుగు చలన చిత్ర పరిశ్రమలో తెలుగు అమ్మాయిలకు అంత త్వరగా అవకాశాలు రావు. వచ్చినా ఎక్కువ రోజులు ఉండవు అంటూ ఉంటారు. దీనికి కొంతమంది నాయికల్ని ఉదాహరణగా చూపిస్తుంటారు కూడా. తాజాగా మరోసారి ఇదే అంశం చర్చకు వచ్చింది. అదేదో టీవీ ఛానల్‌లోనో, లేక సోషల్ మీడియాలోనో కాదు. ఓ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో. ‘పంచతంత్రం’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ వేదికగా జరిగింది. బ్రహ్మానందం ప్రధాన పాత్రలో రూపొందిన ఈ సినిమాలో ఐదుగురు అమ్మాయిలు కూడా నటించారు. వారంతా తెలుగు అమ్మాయిలే కావడం గమనార్హం.
‘‘చిత్ర పరిశ్రమలో చాలామంది తెలుగు అమ్మాయిలు ఉన్నారు. వారికి అవకాశం ఇచ్చి ప్రోత్సహించాలి’’ అంటూ ఈ వేదిక మీద నటి, దర్శకురాలు జీవిత రాజశేఖర్ అన్నారు. ఈ మేరకు అదే కార్యక్రమానికి హాజరైన దర్శకుడు హరీశ్ శంకర్‌కు విజ్ఞప్తి చేశారు. ‘పంచతంత్రం’ సినిమాలో జీవిత రాజశేఖర్ తనయ శివాత్మికతోపాటు స్వాతి, దివ్య శ్రీపాద తదితరులు నటించారు. హర్ష పులిపాక దర్శకత్వం వహించిన ఈ సినిమా ఈ నెల 9న విడుదల కానుంది. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రీ రిలీజ్ కార్యక్రమానికి హరీశ్, జీవిత ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
‘‘నా చిత్ర బృందం నా కుటుంబం అనుకుంటూ ఉంటాను. ‘పంచతంత్రం’ సినిమాలో ఐదుగురు తెలుగు అమ్మాయిలు నటించారు. అలాంటి వారిని ప్రోత్సహించాలి అంటూ హరీశ్ శంకర్‌ను కోరారు. దీనికి హరీశ్ స్పందిస్తూ ‘‘ఓ రచయితగా నేను తెలుగు వారినే ఎంపిక చేసుకోవడానికి ఇష్టపడతా. సినిమా షూటింగ్ సమయంలో ఫస్ట్ టేక్, రెండో టేక్‌కు డైలాగ్ మార్చేస్తుంటా.. అలాంటప్పుడు ముంబయి నుంచి వచ్చిన అమ్మాయిలు ప్రాక్టీస్ చేసుకోవడానికి టైమ్ కావాలంటుంటారు. అలాంటప్పుడు సెట్‌లో తెలుగు వాళ్లు ఉంటే బాగుండు అనిపిస్తుంటుంది’’ అని చెప్పారు హరీశ్.
అయితే కొన్ని పరిస్థితుల వల్ల తెలుగు అమ్మాయిలకు న్యాయం చేయలేకపోతున్నా. ఆ విషయంలో అందరూ నన్ను క్షమించాలి అని హరీశ్ కోరారు. అదే సమయంలో ‘గద్దలకొండ గణేశ్’ సినిమాలో తెలుగు అమ్మాయి అయిన డింపుల్ హయాతీకి ఓ పాటలో అవకాశం ఇచ్చానని చెప్పుకొచ్చారు. ఆ సినిమా తర్వాత డింపుల్‌కి అవకాశాలు వస్తున్నాయని ఈ సందర్భంగా గుర్తు చేశారు.
హిట్2 సినిమా రివ్యూ& రేటింగ్!
మట్టి కుస్తీ సినిమా రివ్యూ & రేటింగ్!
ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం సినిమా రివ్యూ & రేటింగ్!
డీజే టిల్లు టు మసూద ఈ ఏడాది ఎటువంటి అంచనాలు లేకుండా వచ్చి హిట్టు కొట్టిన సినిమాలు..!