అభిమానులారా.. అసభ్యత, బూతులు అభిమానమెలా అవుతాయయ్యా ??

  • April 11, 2021 / 09:53 PM IST

ఒక హీరో మీద అభిమానం అంటే అతను నటించిన సినిమాలన్నీ చూడడం, సదరు హీరో స్టిల్స్, ఇంటర్వ్యూస్, రేర్ ఫోటోస్ కలెక్ట్ చేసుకొని భద్రపరుచుకోవడం, అదృష్టం కొద్దీ ఆ అభిమానిని కలిసినప్పుడు సంతోషంతో ఆలింగనం చేసుకొని, తన అనుభవాలను పంచుకోవడం. అదే హీరోయిన్ ఫ్యాన్ అయితే ఆమె సినిమాలు చూసి సంతోషించడం, ఆమె వయ్యారాలు చూసి మురిసిపోవడం, 80ల కాలం వరకూ అభిమానం అంటే ఇదే. ఆ తర్వాత బ్యానర్లు, పోస్టర్లు, హోర్డింగ్స్, థియేటర్లలో పేపర్లు ఎగరేయడం అంటూ కాస్త డైవెర్ట్ అయ్యింది. అయితే.. అప్పుడప్పుడూ చిన్నపాటి గొడవలు తప్ప పెద్దగా హానికరమైన అంశాలు పుట్టుకురాలేదు. కానీ.. 2010 నుంచి అభిమానం వెర్రితలలు కాయడం మొదలెట్టింది. ఇప్పుడు అభిమానం అంటే తమ హీరో గొప్ప అని చెప్పుకోవడం కంటే.. పరాయి హీరో చెత్త అని చెప్పడమే పరమావధిగా మారిపోయింది. తెలుగు సినిమాల్లో హీరోల ఫ్యాన్స్‌ వార్‌ ఇప్పటిదేం కాదు. సినిమా పుట్టినప్పటి నుండి ఉంది. ఆ రోజుల్లో ఎన్టీఆర్‌ -ఏఎన్నార్‌ ఫ్యాన్స్‌ సినిమాల విషయంలో గొడవపడేవారు. అయితే అది మా హీరో సినిమా హిట్‌, మీ హీరో సినిమా ఫట్‌ అనే వరకే ఉండేది. కృష్ణ – శోభన్‌బాబు – కృష్ణంరాజు అభిమానుల మధ్య కూడా ఇలాంటి గొడవే జరిగేది. అది కూడా సినిమా వరకే. ఏఎన్నార్‌ – కృష్ణ నటించిన ‘హేమా హేమీలు’లో కృష్ణ కంటే అక్కినేని ఎక్కువ డ్రెస్‌లు మార్చారని అప్పట్లో అభిమానులు మహిళా దర్శకురాలు విజయనిర్మలను అడిగారట. అది అప్పటి అభిమానం. ఆ తర్వాత ‘వారసుడు’లో కృష్ణకు ఫైట్‌ ఎందుకు పెట్టలేదని అడిగారు. అది అప్పటి అభిమానం. మరి ఇప్పటి అభిమానులు ఎలా ఉన్నారు. దాని గురించే మాట్లాడుకుందాం.

సినిమా రిలీజ్ అంటే థియేటర్ల దగ్గర బ్యానర్లు, ఆ బ్యానర్లు చింపేస్తే గొడవలు కామన్‌. చిరంజీవి- బాలకృష్ణ – నాగార్జున- వెంకటేశ్‌ లు పీక్ స్టేజ్ లో స్టార్ డమ్ ను ఎంజాయ్ చేస్తున్న టైమ్‌లో ఎక్కువగా వినిపించేవి. అయితే కొన్ని రోజులకు బాగా తగ్గిపోయాయి. ఇప్పుడు బ్యానర్లే తగ్గిపోయాయి. ఇప్పుడన్నీ ఆన్లైన్ యుద్ధాలే. మరీ ముఖ్యంగా ఫేస్ బుక్, ట్విటర్ లో హ్యాష్ ట్యాగ్‌ వార్ గురించి ముఖ్యంగా చెప్పుకోవాలి. సినిమా ప్రచారం కోసం హ్యాష్‌ట్యాగ్‌లు ఓ వైపు క్రియేట్‌ చేస్తుంటే… తిట్టుకోవడం కోసం మరోవైపు ట్యాగ్‌లు క్రియేట్ చేస్తున్నారు. ఆ హీరోను తిట్టడానికి ఫలానా హ్యాష్‌ ట్యాగ్‌ వాడుకోండి అంటూ పేజీలు కూడా పుట్టుకొచ్చాయి. తిట్టుకోవడం ఎలా అభిమానం అవుతుంది మిత్రులారా?

మీ అభిమాన హీరోను ఎవరైనా ఏమన్నా అంటే కోపం వస్తుంది తప్పదు. అయితే మీ అభిమాన హీరోను పొగడకపోతే కోపం వచ్చేస్తే ఎలా? ఇది మీకు ఈజీగా అర్థం కావాలంటే ఒక రెండు ఉదాహరణలు చూద్దాం. ‘అత్తారింటికి దారేది’లో స్పెషల్ సాంగ్‌ చేయనందుకు అనసూయను పవన్‌ అభిమానులు ఇప్పటికీ తిట్టిపోస్తున్నారు. ‘గూఢచారి’ గురించి మహేష్‌బాబు ట్వీట్‌ చేస్తూ శోభిత దూళిపాళ్లను కూడా ప్రస్తావించాడు. దానికి రిప్లైగా ఆమె ‘థ్యాంక్యూ’ అని రాసింది. అయితే మహేష్‌ లాంటి సూపర్‌స్టార్‌ మీ గురించి ట్వీట్‌ చేస్తే… నార్మల్‌గా థ్యాంక్యూ అని రాస్తారా… అంటూ ఆమెను ట్రోలింగ్‌ చేశారు. ట్రోలింగ్‌ వ్యక్తిగత విషయాలు తీసుకురావడం మరో ట్రెండ్‌. బాడీ షేమింగ్‌, ఫ్యామిలీ రిమార్కింగ్ ఇలా చాలా పనులు చేస్తున్నారు. ఇవి కొన్ని మాత్రమే. అసలు ట్రోలింగ్ అభిమానం ఎలా అవుతుంది గురూ? సినిమా ట్రైలర్లు విడుదలైతే అభిమానులు వ్యూస్‌ లెక్కపెట్టుకుంటుంటారు. ఆ వీడియోకు వచ్చే లైక్‌లు చూసుకుంటుంటారు. కానీ కొంతమంది ఉంటుంటారు, వీడియో ఎప్పుడు వస్తుందా… ఎప్పుడు డిస్‌లైక్‌ కొడదామా అని చూస్తుంటారు. మొన్నామధ్య నెపోటిజం పేరుతో ఆలియా భట్‌ సినిమా టీజర్‌కు డిస్‌ లైక్‌ కొట్టి రికార్డులు సాధించేశారు. ఆ మధ్య ఆమిర్‌ ఖాన్‌ ఏదో అన్నారని ఆయన ప్రచారం చేసే ఓ ఈకామర్స్‌ యాప్‌కు రేటింగ్‌ తగ్గించేశారు. నెపోటిజం పేరుతో కొంతమంది హీరోలు/హీరోయిన్లను ద్వేషించే అభిమానుల పనే ఇదంతా. అయినా ఒకరి మీద ద్వేషం మరొకరి మీద అభిమానం ఎలా అవుతోంది సోదరులారా?

సినిమాల ప్రీ రిలీజ్‌ ఈవెంట్లు వీటన్నింటికీ పీక్స్‌ అని చెప్పాలి. అందులోనూ సినిమా హీరో స్టేజీ మీదకు వచ్చినప్పుడు మొదలవుతుంది అసలు మజా. హీరో అలా మాట్లాడటం మొదలుపెడతాడో లేదో ఓ కుర్రాడు వచ్చి కాళ్ల మీద పడిపోతాడు. వద్దు వద్దు అని ఆ హీరో వారించినా వినడు. ఆఖరికి ఆ డ్రామా కాసేపు నడిచి ఆఖరికి ఓ హగ్గు, సెల్ఫీతో అది ముగుస్తుంది. మొత్తం బౌన్సర్లతో నిండిపోయిన స్టేజీ దగ్గర అసలు ఆ కుర్రాడు ఎలా వచ్చాడు. ఇదంతా వదిలేద్దాం. అయినా హీరో మీద అభిమానం చూపించాలంటే అలా కాళ్ల మీద పడిపోవాలా. అవును అసలా కుర్రాడు అభిమానంతోనే వచ్చాడా?

ఇదంతా అభిమానం పేరుతో జరుగుతోందని అనుకున్నా… అంతకుమించి అన్నట్లుగా కొందరు చేస్తుంటారు. అందులో ఒకటి మొన్నే మనం చూశాం. ‘వకీల్‌సాబ్‌’ సినిమా వేస్తుంటే… రక్తంతో స్క్రీన్‌ మీద పేరు రాశారు. ఇదోరకం వైపరీత్యం. మొన్నామధ్య వచ్చిన ‘ఇస్మార్ట్‌ శంకర్‌’ రిలీజ్‌ రోజు పోస్టర్‌కి బీరాభిషేకం చేశారు. ‘లైగర్‌’ పోస్టర్‌ విషయంలోనూ ఇది జరిగింది. అయినా ఇలా బీర్లు పొంగించడం, రక్తాలు రాయడం అభిమానం ఎలా అవుతుంది అభిమానులారా? పాలాభిషేకమే వద్దంటున్న సమయంలో ఇదేం పని. ఇప్పటివరకు అభిమానం పేరుతో యువత ఎలా పెడదోవ పడుతోందో చూశాం… అసలు ఇది కంట్రోల్‌ అవ్వడానికి హీరోలు ఏం చేయాలో కూడా మాట్లాడదాం. హీరో చెబితే అభిమానులు వింటారు అనేది అనేక సాంఘిక సేవా కార్యక్రమాలు జరగడం బట్టి మనకు తెలుస్తోంది. విపత్తులు వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు హీరోల పిలుపులు మేరకు అభిమానులు వచ్చి సాయం చేస్తుంటారు. అలాంటిది ఇప్పుడు అభిమానం పేరుతో చేస్తున్న ఇలాంటి అతి కార్యక్రమాలు ఆపమని హీరోలు చెప్పకూడదా? చెప్పొచ్చు. ఆ మాటకొస్తే ఇప్పటికే చాలాసార్లు చెప్పారు. అయినా అభిమానులు వినడం లేదు. అంటే హీరో మీద అభిమానులకు గౌరవం లేదా? లేక ఉన్నా అది పరాయి హీరోలను తిట్టడానికి, వారి కుటుంబ సభ్యులను అసభ్యంగా విమర్శించడానికే సరిపోతుందా?

ఇక్కడే ఇంకో మాట కూడా వినిపిస్తూ ఉంటుంది. అసలు ఆ పని చేసేవాళ్లు ఆ హీరో అభిమానులేనా అని. నిజమే ఫలానా పని చేసినవాడు ఆ హీరో అభిమానే అని ఐడీ కార్డులు ఏమీ ఉండవు కదా. “జై లవకుశ” సమయంలో అసలు అలా ట్రోలింగ్ చేసేవాళ్ళు నా ఫ్యాన్స్ అని ప్రూఫ్ ఏంటి? అని మీడియాని ప్రశ్నించాడు ఎన్టీయార్, అలానే మహేష్ బాబు కూడా “భరత్ అనే నేను” రిలీజ్ టైంలో స్టేజ్ మీద “మేము మేము బాగానే ఉన్నాం, మీరే బాగుండాలి” అని ప్రత్యేకంగా చెప్పిన విషయాన్ని అభిమానులు పెద్దగా ఖాతరు చేయలేదు. పైగా.. “సరిలేరు నీకెవ్వరు” ప్రీరిలీజ్ ఈవెంట్ కి చిరంజీవి ముఖ్య అతిధిగా విచ్చేయడాన్ని మహేష్ బాబు విశేషమైన రీతిలో ఆస్వాదించగా, ఒక వర్గం మహేష్ ఫ్యాన్స్ మాత్రం అదేదో పెద్ద ఘోరమైన విషయంలా భావించి సోషల్ మీడియాలో దర్శకుడు అనిల్ రావిపూడిని నానా తిట్లు తిట్టారు. మహేష్ బాబు స్వయంగా చిరంజీవిని ఆహ్వానించారంటే ఎంత మంచి విషయం. అలాంటి విషయాన్ని కొందరు దురాభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారంటే అభిమానులు ఎంత దిగజారిపోయారో ప్రత్యేకించి చెప్పాలా?

ఆఖరిగా ఒక్కమాట… హీరోలంతా ఒక్కటే అని చాలాసార్లు విన్నాం, చూశాం. అలా అని వారి మధ్య గిల్లీకజ్జాలు ఉంటాయి. సఖ్యత కూడా ఉంటుంది. అలా అభిమానులంతా ఒక్కటే అని ఎందుకు అనుకోరు. సినిమా వచ్చినప్పుడు గిల్లికజ్జాలు ఉండాలి… కానీ మన తెలుగు సినిమా హిట్‌ అయ్యింది… మన పరిశ్రమ బాగుపడుతుందని అనుకోండి. అంతే కానీ పరాయి హీరో సినిమా హిట్ అయితే నెగిటివ్ ట్రెండ్ చేయడాలు, సోషల్ మీడియాలో బూతులతో కామెంట్లు పెట్టడాలు తగ్గించుకొండయ్యా. వేడి తగ్గి, వయసు పెరిగాక సదరు కామెంట్లు చూసుకుంటే “మరీ ఇంత నీచంగా బిహేవ్ చేశానా?” అని మీకు మీరే సిగ్గుపడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇప్పటికైనా కళ్ళు తెరవండి. కాస్త కామన్ సెన్స్ తో ఆలోచించి సామాజిక బాధ్యత లేకపోయినా పర్వాలేదు, కనీస స్థాయి విలువలతో ఆలోచించండి.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus