విజయ్-మురుగదాస్ కాంబినేషన్ లో వచ్చిన “సర్కార్” విశ్లేషకుల్ని ఆకట్టుకోలేక యావరేజ్ టాక్ తెచ్చుకున్నా.. కలెక్షన్స్ పరంగా మాత్రం సంచలనాలు సృష్టిస్తూనే ఉంది. పొలిటికల్ డ్రామా నేపథ్యంతో తీసిన ఈ సినిమా, కొన్ని వివాదాలను ఎదుర్కొంటూనే వుంది. అయినా వసూళ్ల పరంగా దూసుకుపోతూనే వుంది. తొలి రెండు రోజుల్లోనే 100 కోట్లకి పైగా గ్రాస్ ను వసూలు చేసిన ఈ సినిమా, ప్రపంచవ్యాప్తంగా 4 రోజుల్లో 150 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. 150 కోట్ల క్లబ్ లోకి విజయ్ అడుగుపెట్టడం ఇది మూడోసారి. గతంలో ఆయన నటించిన “తెరి, మెర్సల్” సినిమాలు ఈ ఫీట్ ను సాధించాయి.
అలాగే.. తెలుగు వెర్షన్ కూడా మంచి లాభాలు తెచ్చిపెడుతోంది. దాదాపు 7 కోట్ల రూపాయలకు అమ్ముడుపోయిన “సర్కార్” చిత్రానికి ఇక్కడ మిశ్రమ స్పందన లభించింది. దాంతో తెలుగు నిర్మాత భారీగా నష్టపోతాడని అంచనా వేశారు అందరూ. కట్ చేస్తే.. ఆదేవారం విడుదలైన “అదుగో, కర్త కర్మ క్రియ” లాంటి తెలుగు సినిమాలతోపాటు.. బాలీవుడ్ చిత్రం “థగ్స్ ఆఫ్ హిందుస్తాన్” కూడా డిజాస్టర్స్ గా నిలవడంతో తెలుగు ప్రేక్షకులకి “సర్కార్” తప్ప మరో ఆప్షన్ లేకపోయింది. దాంతో తెలుగు రాష్ట్రాల్లోనూ ఈ చిత్రం మంచి కలెక్షన్స్ సాధిస్తోంది.