“కేరాఫ్ కంచర్లపాలెం”తో నిర్మాతగా తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ఏర్పరుచుకున్న ప్రవీణ పరుచూరి దర్శకురాలిగా మారి తెరకెక్కించిన చిత్రం “కొత్తపల్లిలో ఒకప్పుడు”. ఈ చిత్రాన్ని రానా ప్రెజంట్ చేసి ప్రమోట్ చేయడంతో మంచి ఆసక్తి నెలకొంది. కొన్ని ఊర్లలో మరియు మీడియాకి ఈ సినిమాని కొన్ని రోజుల ముందే చూపించారు. సినిమా మీద టీమ్ కి ఉన్న నమ్మకం అలాంటిది. మరి ఆ నమ్మకం ప్రేక్షకుల్ని మెప్పించగలిగిందా? లేదా? అనేది చూద్దాం..!!
కథ: విజయనగరం జిల్లాలోని కొత్తపల్లి గ్రామానికి చెందిన రామకృష్ణ (మనోజ్ చంద్ర) ఊర్లో రికార్డింగ్ డ్యాన్సులు కండెక్ట్ చేస్తూ, అదే ఊర్లో అందరికీ అప్పులు ఇచ్చే అప్పన్న (రవీంద్ర విజయ్) దగ్గర అసిస్టెంట్ గా వర్క్ చేస్తుంటాడు.
అనుకోని విధంగా గడ్డివాము దగ్గర కూర్చోవడం రామకృష్ణ జీవితాన్ని మార్చేస్తుంది.
అసలు గడ్డివాము దగ్గర ఏం జరిగింది? రామకృష్ణ ఆ సమస్యల నుంచి ఎలా బయటపడ్డాడు? అందుకోసం ఏం చేశాడు? అనేది “కొత్తపల్లిలో ఒకప్పుడు” కథాంశం.
నటీనటుల పనితీరు: తెలుగులో పరిచయ చిత్రమైనప్పటికీ రామకృష్ణ పాత్రలో మనోజ్ చంద్ర చాలా చక్కగా ఒదిగిపోయాడు. అతడి యాస, భాష, వ్యవహారశైలి సహజంగా ఉన్నాయి. అయితే.. అతడి క్యారెక్టర్ ఎస్టాబ్లిష్మెంట్ ఇంకాస్త నీట్ గా చేసి ఉంటే బాగుండేది అనిపించకమానదు. నటుడిగా మాత్రం మనోజ్ చంద్రకి మంచి భవిష్యత్ ఉంది.
మరో కీలకపాత్రలో రవీంద్ర విజయ్ సినిమాకి హైలైట్ గా నిలిచాడు. కనిపించేది కాసేపే అయినప్పటికీ అతడి పాత్ర చాలా ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా రవీంద్ర విజయ్ మాట్లాడే కొన్ని మాటలు చాలా పెద్ద బూతు అయినప్పటికీ ఎక్కడా అసభ్యత లేకుండా అతడు వాటిని పలికిన తీరు ప్రశంసనీయం.
నటుడు బెనర్జీని చాలా రోజుల తర్వాత ఒక ఫుల్ లెంగ్త్ రోల్లో చూడడం ఆనందంగా అనిపించింది. మంచి బరువైన పాత్ర, చాలా షేడ్స్ ఉంటాయి కూడా.
అందం అలియాస్ ఆదిలక్ష్మిగా ఉషా బోనెల మంచి నటన కనబరించింది. ఆమె పాత్రతో పండించిన కామెడీ అన్నిసార్లు వర్కవుట్ అవ్వలేదు కానీ.. ఓవరాల్ గా పర్వాలేదనిపించింది.
మౌనిక పాత్ర చిన్నదే అయినప్పటికీ.. స్క్రీన్ ప్రెజన్స్ తో ఆకట్టుకుంది. తెలుగు యాస సరిగా పలకలేకపోయింది కానీ.. నటిగా మెప్పించింది.
ఇక ప్రొడ్యూసర్ కమ్ డైరెక్టర్ ప్రవీణ్ పరుచూరి ఈ చిత్రంలోనూ ఓ పాత్ర పోషించింది. మేకప్ కాస్త సెట్ అవ్వలేదు కానీ.. ఎక్స్ ప్రెషన్స్ తో మాత్రం అలరించింది.
సాంకేతికవర్గం పనితీరు: మణిశర్మ పాటలు వినసొంపుగా ఉన్నాయి. అయితే.. “కన్యారాశి” పాట యొక్క సాహిత్యం వైవిధ్యంగా ఉన్నప్పటికీ, మెప్పించలేకపోయింది. వరుణ్ ఉన్ని బ్యాగ్రౌండ్ స్కోర్ డీసెంట్ గా ఉంది. ఇంటర్వెల్ & క్లైమాక్స్ సీన్స్ కి మంచి ఎలివేటింగ్ బీజియం ఇచ్చాడు.
పెట్రోస్ సినిమాటోగ్రఫీ వర్క్ బాగానే ఉంది కానీ.. సాధారణంగా డ్రీమ్ సీక్వెన్సులు లేదా వెడ్డింగ్ షాట్స్ తీసే అనమార్ఫిక్ లెన్స్ తో సినిమా మొత్తం తీయడం వల్ల బ్లర్ ఎఫెక్ట్ అనేది సినిమా చూస్తున్నప్పుడు ఇబ్బందికరంగా మారింది. కొన్ని సీక్వెన్సుల వరకు ఆ ఎఫెక్ట్ బాగానే సింక్ అయ్యింది కానీ.. ఓవరాల్ గా మాత్రం ప్రాపర్ సినిమాటిక్ ఎక్స్ పీరియన్స్ ఇవ్వలేకపోయింది.
ఎడిటింగ్ పరంగానూ సినిమా ఎందుకనో ఆకట్టుకోలేకపోయింది. ముఖ్యంగా బెనర్జీ-మనోజ్ సీనియస్ గా సంభాషించుకునే సన్నివేశంలో జంప్ కట్స్ డిస్టర్బ్ చేస్తాయి. ఆ సీక్వెన్స్ ను మోనోలాగ్ లా కన్సీవ్ చేసి ఉంటే బాగుండేది.
సీజీ వర్క్ విషయంలో చాలా లోపాలున్నాయి. అయితే.. ఒక ఇండిపెండెంట్ సినిమాకి ఏమాత్రం క్వాలిటీ అని మెచ్చుకోదగ్గ విషయమే.
దర్శకురాలు మరియు నిర్మాత మరియు నటి పరుచూరి ప్రవీణ “కొత్తపల్లిలో ఒకప్పుడు” కోసం ఎంచుకున్న కోర్ పాయింట్ మంచిదే. మంచి చేసే గుడ్డి నమ్మకం మంచిదే అని కాస్నెప్ట్ ను ఆమె డీల్ చేసిన విధానంలో క్లారిటీ లోపించింది. ముఖ్యంగా రామకృష్ణలో మార్పుకి కారణం ఏంటి అనే జస్టిఫికేషన్ మిస్ అయ్యింది. దాంతో సినిమా ఎండింగ్ కన్విన్సింగ్ గా అనిపించదు. అందువల్ల.. ఎంత ఆర్గానిక్ గా ఉన్నా సినిమా సంతృప్తినివ్వలేకపోయింది. ఓవరాల్ గా చెప్పాలంటే.. దర్శకురాలిగా ప్రవీణ పూర్తిస్థాయిలో ఆకట్టుకోలేకపోయింది.
విశ్లేషణ: “కేరాఫ్ కంచరపాలెం” రిలీజ్ అయినప్పుడు అందరూ క్లైమాక్స్ చూసి షాక్ అయ్యారు. ఇలా కూడా ఒక స్క్రీన్ ప్లే రాయొచ్చా? ఇలా కూడా సినిమాని ముగించవచ్చా? అని షాక్ అయ్యారు. అలాంటి మేకర్స్ నుంచి ఒక సినిమా వస్తున్నప్పుడు కచ్చితంగా మంచి అంచనాలుంటాయి. “కొత్తపల్లిలో” ఎనౌన్స్ మెంట్ స్టేజ్ నుంచి మంచి ఆసక్తి నెలకొంది. మరీ ముఖ్యంగా “లవ్ లెటర్ టు తెలుగు సినిమా” అని ప్రమోట్ చేయడంతో ఎలా ఉండబోతోందో అనే ఆసక్తి నెలకొంది. ఆ అంచనాలను అందుకోవడంలో “కొత్తపల్లిలో ఒకప్పుడు” తడబడిందనే చెప్పాలి. అయితే.. రూరల్ కామెడీ డ్రామా మెచ్చే ప్రేక్షకులు ఈ సినిమాని ఓసారి ట్రై చేయొచ్చు!
ఫోకస్ పాయింట్: కారణం కొరవడిన గుడ్డి నమ్మకం!
రేటింగ్: 2/5