రీమేక్‌ల గురించి విని ఉంటారు.. ఫ్రీమేక్‌ల గురించి కూడా వినే ఉంటారు. రెండింటికీ మధ్య తేడా గురించి కూడా తెలిసే ఉంటుంది. ఇప్పుడు ఈ టాపిక్ గురించి ఎందుకు అనుకుంటున్నారా? ఎందుకంటే ప్రస్తుతం కోలీవుడ్‌లో ఎక్కడ చూసినా ఇదే టాపిక్ మీద చర్చ జరుగుతోంది కాబట్టి. విజయ్ (Thalapathy Vijay) – వెంకట్ ప్రభు (Venkat Prabhu) కాంబినేషన్‌లో తెరకెక్కిన ‘ది గోట్’ (The Greatest of All Time) ఇటీవల విడుదలై సరైన ఫలితం అందుకోలేదు. అయితే ఇలాంటి సినిమా గతంలో ఒకటి వచ్చింది అంటూ ఓ పాత సినిమా పేరు డిస్కషన్‌లోకి తీసుకొచ్చారు.
అది కూడా సుమారు 30 ఏళ్ల క్రితం నాటి సినిమా. 1993లో విజయ్ కాంత్ హీరోగా ‘రాజదురై’ అనే సినిమా వచ్చింది. తెలుగులో ఆ సినిమాను ‘రాజసింహ’ పేరుతో డబ్బింగ్ కూడా చేశారు. ఆ రోజుల్లో తమిళ సినిమాలు అలా వచ్చేవిలెండి. నిజాయితీ గల పోలీస్ అధికారి నేపథ్యంలో ఆ సినిమా తెరకెక్కింది. ఆ పోలీసు అధికారి మీద పగతో రగిలిపోయే విలన్ అతని కొడుకు పసివాడిగా ఉన్నప్పుడే ఎత్తుకుపోయి చెడ్డవాడిలా పెంచుతాడు.
ఈ క్రమంలో తండ్రి మీద ద్వేషం కలిగేలా పెంచుతాడు. యుక్త వయసు వచ్చాక అచ్చం నాన్న పోలికల్లోనే ఉన్న విజయ్ కాంత్ సొంత ఇంటికే శత్రువుగా మారతాడు. ఆ తర్వాత జరిగేదంతా సినిమా కథ. ‘ది గోట్’ సినిమా చూసినవాళ్లకు ఆ సినిమా కథ, ఈ సినిమా కథ ఒకటే అనిపించకమానదు. అయితే, డీ ఏజింగ్ టెక్నాలజీ వాడి.. విజయ్‌నే (Thalapathy Vijay) కుర్రాడిలా చూపించారు.
అయితే.. యంగ్ హీరో నెగిటివ్ షేడ్‌ని క్లైమాక్స్ వరకు మార్చకుండా కొనసాగించారు. అదొక్కటే మార్పు. అయితే పాత సినిమా గురించి తెలియనివారు వెంకట్ ప్రభు వెరైటీ కథ రాసుకున్నారని అనుకుంటున్నారు. అయినా విజయ్ (Thalapathy Vijay) సినిమాల కథలు పాత బ్లాక్ బస్టర్ సినిమాలను పోలి ఉండటం కొత్తేమీ కాదు. గతంలో చాలా సినిమాలను ఇదే జరిగింది.