Thaman: వినాయక చవితికి ఓ పాత కొత్త పాట రెడీ చేస్తున్న తమన్
- August 31, 2026 / 01:52 PM ISTByFilmy Focus Desk
అనిల్ రావిపూడి జోనర్‌లోకి త్రివిక్రమ్ శ్రీనివాస్ వస్తే ఎలా ఉంటుందో చెప్పకనే చెబుతూ.. ఇటీవల ఒకే టీజర్‌ను ముక్కలు ముక్కలుగా కట్ చేసి రిలీజ్ చేసింది ‘ఆదర్శ కుటుంబం ఇంటి నెం 47’ టీమ్. ‘ఏకే 47’ అనే షార్ట్ నేమ్‌తో చలామణిలో ఉన్న ఈ సినిమాను అక్టోబరు 2న తీసుకొస్తాం అని చాలా రోజుల క్రితమే చెప్పారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ స్టేజీలో ఉన్న ఈ సినిమా గురించి ఓ ఆసక్తికర విషయం ఒకటి బయటకు వచ్చింది. వినాయక చవితికి ఓ పాత కొత్త పాటను సినిమా టీమ్ రిలీజ్ చేస్తుందట.
Thaman
పాత కొత్త పాట అంటే.. కొత్త విషయమేమీ కాదు, రీమిక్స్ అని అర్థం. ‘ఆదర్శ కుటుంబం’ సినిమాలో వినాయక చవితి సన్నివేశాలు కూడా ఉన్నాయట. ఈ క్రమంలో బ్యాగ్రౌండ్‌లో ఓ సాంగ్ కోసం చూస్తుండగా.. కొత్తదెందుకు ఓ పాత పాటను అందులోనూ ఓ హిట్ పాటను తీసుకొని పెట్టి హిట్ వైబ్ తీసుకొచ్చేద్దాం అనుకున్నారట. రీసెంట్‌గా కొన్ని సినిమాలు ఇదే పని చేస్తున్నాయి కూడా. దీంతో ‘కూలీ నెం. 1’ సినిమాలోని ‘దండాలయ్యా ఉండ్రాలయ్యా..’ పాటను తీసుకుంటున్నారట.

ఇప్పటికే ఈ పాట చిత్రకరణ కూడా పూర్తయిందని.. వినాయక చవితి సందర్భంగా ఆ పాటను రిలీజ్ చేసి సినిమా ప్రచారాన్ని పూర్తి స్థాయిలో షురూ చేసే ఆలోచనలో ఉన్నారట. ఎందుకంటే సినిమా రిలీజ్ డేట్‌కి అప్పటికి రెండు వారాలు మాత్రమే ఉంటుంది. సినిమా ప్రచారం విషయంలో కాస్త నెమ్మదించారు అనే మాటను కూడా ఈ పాటతో తేల్చేయాలని అనుకుంటున్నారట. హారిక హాసిని క్రియేషన్స్ పతాకంపై రూపొందుతున్న ఈ సినిమాలో శ్రీనిధి శెట్టి కథానాయిక.
క్రైమ్ – ఫ్యామిలీ అంశాల మేళవింపుతో రూపొందుతున్న ఈ యాక్షన్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌లో వెంకటేశ్.. చిట్టిబాబు పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమాకి తమన్ సంగీతమందిస్తున్నారు. రీసెంట్‌గా ‘ప్యారడైజ్’ సినిమాలో ‘ఏష నాగుల..’ పాటను యాడ్ చేసి హిట్ వైబ్‌ను అందుకున్న విషయం తెలిసిందే.















