“పెళ్ళిచూపులు” చిత్రంతో దర్శకుడిగా సంచలనాలు సృష్టించిన తరుణ్ భాస్కర్ “ఈ నగరానికి ఏమైంది?” గత శుక్రవారం విడుదలై ప్రేక్షకుల్ని కడుపుబ్బ నవ్విస్తూ ఘన విజయం దిశగా ముందుకు సాగుతోంది. అయితే.. కొన్ని రివ్యూల్లో మాత్రం కథ-కథనం మరియు తరుణ్ భాస్కర్ ప్రతిభ పట్ల నెగిటివ్ కామెంట్స్ వచ్చాయి. సినిమా బాగోలేదు అనకపోయినా ఇంకాస్త జాగ్రత్త వహించి ఉంటే సినిమా వుట్ పుట్ బాగుండేది అని అభిప్రాయపడ్డారందరూ. ఈ అభిప్రాయాల పట్ల కాస్త ఘాటుగానే స్పందించాడు దర్శకుడు తరుణ్ భాస్కర్. నేను కష్టపడి తీసిన సినిమాకి రివ్యూలు రాసే హక్కు ఎవరిచ్చారు, అసలు రివ్యూ రైటర్లకు ఏం క్వాలిఫికేషన్ ఉంది అంటూ సోషల్ మీడియాలో కాస్త ఫైర్ అయ్యాడు. తరుణ్ ఫైర్ కి రివ్యూ రైటర్స్ అందరూ ఫైర్ బ్యాక్ అవ్వడంతో ఒక్కసారిగా మాట మార్చాడు తరుణ్.
నిన్న సాయంత్రం జరిగిన “ఈ నగరానికి ఏమైంది?” సక్సెస్ మీట్ లో రివ్యూల గురించి మాట్లాడుతూ.. “నా మాటలు నేను వెనక్కి తీసుకొంటున్నాను. నేను కావాలని అలా అనలేదు, ఐ రెస్పాక్ట్ రివ్యూస్ కానీ.. కెమెరా ఎక్కడ పెట్టాలో తెలియలేదు అంటూ ఒక రివ్యూలో పేర్కొనేసరికి కోపంలో అలా పోస్ట్ చేశాను. అయినా నేను సోషల్ మీడియాకి దూరంగా ఉండాలి అనుకొంటున్నాను. నా మొదటి సినిమా సక్సెస్ కి రివ్యూలే కారణం, అందుకే నేను రివ్యూలను ఎప్పటికీ ఇష్టపడతాను, గౌరవిస్తాను” అంటూ వివరణ ఇచ్చాడు తరుణ్ భాస్కర్.