‘పుష్ప 2’ సినిమా తర్వాత అల్లు అర్జున్ సినిమా ఏంటి? ఈ ప్రశ్న చాలా నెలలపాటు వినిపించింది. దీనికి సమాధానంగా చాలా తెలుగు, తమిళ దర్శకుల పేర్లు వినిపించాయి. ఏ విషయం తేలక… బన్నీ టీమ్ చెప్పినప్పుడు చూద్దాం లే అని అభిమానులు అనుకున్నప్పుడు హఠాత్తుగా త్రివిక్రమ్ సినిమాను అనౌన్స్ చేసేశారు. హమ్మయ్య అని అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. అయితే ఇప్పుడు మరో సినిమా ఇలానే చర్చల్లోకి వచ్చింది. అన్నీ అనుకున్నట్లుగా జరిగితే ఈ నెలాఖరులో కన్ఫర్మేషన్ వచ్చేస్తుంది అంటున్నారు.
ఒకప్పుడు (Allu Arjun) అల్లు అర్జున్ వేరు, ఇప్పుడు అల్లు అర్జున్ వేరు. ఐకాన్ స్టార్ కాస్త ఇప్పుడు నేషనల్ బెస్ట్ యాక్టర్ అయిపోయాడు. దీంతో ఇప్పుడు సినిమాల ఎంపిక విషయంలో ఇంకాస్త జాగ్రత్తగా ఉండాలి అని అనుకుంటున్నాడు. దానితోడు ‘పుష్ప’ సినిమా ఇచ్చిన పాన్ ఇండియా ఇమేజ్ కూడా ఉంది. ఈ క్రమంలో రాబోయే సినిమాలు పాన్ ఇండియా లెవల్లో, ఆ స్థాయిలో ఉండేలా ప్లాన్స్ వేస్తున్నాడట. ఈ క్రమంలో కోలీవుడ్ డైరక్టర్ అట్లీ కథను ఇటీవల బన్నీ విన్నాడట.
ప్రస్తుతం అల్లు అర్జున్ ‘పుష్ప 2’ పనుల్లో బిజీగా ఉన్నాడు. నగరంలో వివిధ స్టూడియోస్‌లో వేసిన సెట్స్‌లో నిరాటంకంగా షూటింగ్ చేస్తున్నాడు. మధ్య మధ్యలో ఖాళీ దొరికినప్పుడు కొత్త కథలు వింటున్నాడు. అలా ఈ మధ్య అట్లీ కూడా బన్నీకి ఓ పాయింట్ చెప్పాడట. లైన్ నచ్చడంతో త్వరలోనే ఫైనల్ వెర్షన్ రెడీ చేయమని అడిగాడట. అట్లీ ప్రస్తుతం షారుఖ్ ఖాన్ ‘జవాన్’ రిలీజ్ పనుల్లో బిజీగా ఉన్నారు. ఆ సినిమా పనులు అయ్యాక బన్నీకి ఫైనల్ నెరేషన్ ఇస్తరట.
అప్పుడు ఓకే అనుకుంటే… బన్నీ – అట్లీ సినిమా అనౌన్స్మెంట్ ఉంటుంది అంటున్నారు. అయితే ఈ సినిమాకు ఓ నిర్మాతగా అల్లు అరవింద్ ఉంటారని, మరో నిర్మాత తమిళనాడు నుండి వస్తారని చెబుతున్నారు. గతంలో బన్నీ ఇలానే మురుగదాస్, లోకేశ్ కనగరాజ్‌తో సినిమాలకు ప్రయత్నాలు చేశారు. కానీ అవేవీ వర్కవుట్ కాలేదు. మరిప్పుడు అట్లీ సంగతి ఏమవుతుందో చూడాలి.