ది ఫ్యామిలీ మ్యాన్ 2 సిరీస్ రివ్యూ & రేటింగ్!

  • June 4, 2021 / 10:25 PM IST

వెబ్ సిరీస్ లు అంటే హాలీవుడ్ మాత్రమే తీయగలరు అనే ఒక రూమర్ ను బ్రేక్ చేసిన సిరీస్ “ది ఫ్యామిలీ మ్యాన్”. మనోజ్ బాజ్ పాయ్, ప్రియమణి ప్రధాన పాత్రల్లో రూపొందిన ఈ సిరీస్ నిజానికి హిందీలో తెరకెక్కినప్పటికీ.. సౌత్ ఆడియన్స్ ను కూడా విశేషంగా ఆకట్టుకుంది. దాంతో సెకండ్ సీజన్ మొదలెట్టారు మేకర్స్. సెకండ్ సీజన్ లో సమంత నెగిటివ్ రోల్ ప్లే చేయడం సౌత్ లో ఈ సిరీస్ కు విశేషమైన హైప్ తీసుకొచ్చింది. ఇక సెకండ్ సీజన్ ట్రైలర్ రిలీజైనప్పట్నుంచి తమిళుల ఆగ్రహాన్ని భారీ స్థాయిలో ఎదుర్కొని విడుదలకు ఒక రోజు ముందు వరకూ వార్తల్లో నిలిచిన సిరీస్ కంటెంట్ పరంగా ఎలా ఉందో చూద్దాం..!!

కథ: శ్రీకాంత్ తివారీ (మనోజ్ బాజ్ పాయ్) బయట ప్రపంచానికి ఓ సాధారణ ఫ్యామిలీ మ్యాన్. కానీ టాస్క్ డిపార్ట్ మెంట్ లో టెర్రరిజాన్ని అంతమొందించే టీం ను లీడ్ చేసే సిన్సియర్ ఆఫీసర్. తన కుటుంబం కోసం టాస్క్ కు గుడ్ బై చెప్పి సాఫ్ట్ వేర్ కంపెనీలో జాయినవుతాడు.

మరోపక్క శ్రీకాంత్ స్నేహితుడు జె.కె & టీం శ్రీలంక తమిళ టైగర్ల గ్రూప్ భారతదేశపు ప్రధానిని అంతమొందించే ప్రయత్నాన్ని తిప్పికొట్టడం కోసం చాలా ప్రయత్నాలు చేస్తుంటారు. కొంత విరామం అనంతరం మళ్ళీ టాస్క్ లోకి వచ్చిన శ్రీకాంత్ & టీం జీవితంలో అందర్నీ కోల్పోయి పగ మాత్రమే జీవితంగా బ్రతుకుతున్న టెర్రరిస్ట్ రాజీ (సమంత)ను ఎలా అడ్డుకున్నాడు? ప్రధానమంత్రిని ప్రాణాపాయం నుంచి కాపాడగలిగారా? అనేది సెకండ్ సీజన్ స్టోరీ.

నటీనటుల పనితీరు: శ్రీకాంత్ తివారీ పాత్రలో మనోజ్ బాజ్ పాయ్ మినహా మరో నటుడ్ని ఊహించుకోలేమ్. ఎమోషనల్ సీన్స్ లో సైతం క్రోధాన్ని, బాధని కళ్ళతో పలికించడం అనేది చాలా తక్కువ మంది నటులు మాత్రమే ప్రదర్శించగలిగిన విషయం.

సమంత తన కెరీర్ లో పోషించిన మోస్ట్ డిఫరెంట్ & రిస్కీ రోల్ రాజీ. ఒక టెర్రరిస్ట్ గా, సాధారణ మహిళగా సమంత అద్భుతంగా నటించింది. ముఖ్యంగా బస్ సీన్ లో ఆమె హావభావాల ప్రదర్శన ప్రశంసనీయం. జీవితాన్ని తెగించిన అమ్మాయి ఎలా ఉంటుంది అనేది అద్భుతంగా ప్రొజెక్ట్ అయ్యింది సమంత పాత్ర ద్వారా.

ప్రియమణి క్యారెక్టర్ ను మరీ ఎక్కువగా సాగదీశారు అనిపించింది. నటిగా మాత్రం పాత్రకు న్యాయం చేసింది. తమిళ నటి దేవదర్శిని ఈ చిత్రంలో తనను తాను సరికొత్తగా పరిచయం చేసుకొంది.

సాంకేతికవర్గం పనితీరు: మొదటి సీజన్ కంటే రెండో సీజన్ లో పోలిటికల్ యాంగిల్స్ కాస్త ఎక్కువగా ఉన్నాయి. అందువల్ల ఒక యాక్షన్ థ్రిల్లర్ కంటే పోలిటికల్ థ్రిల్లర్ లా మారిపోయింది ఈ సీజన్. టెక్నికల్ గా, కథ-కథనం పరంగా అద్భుతంగా ఉన్నప్పటికీ.. పోలిటికల్ యాంగిల్ కాస్త తగ్గించి, మొదటి సీజన్ తరహాలో ఎమోషనల్ కనెక్టివిటీ ఇచ్చి ఉంటే ఇంకాస్త బాగుండేది. ఆరో ఎపిసోడ్ లో సింగిల్ షాట్ లో పిక్చరైజ్ చేసిన పోలీస్ స్టేషన్ ఎటాక్ ఎపిసోడ్ సీజన్ మొత్తానికి హైలైట్.

కథా రచయితలుగా, దర్శకులుగా రాజ్ & డి.కె ద్వయం ఈ విషయంలో 100% విజయం సాధించారు. ఒక సక్సెస్ ఫుల్ సౌత్ ఇండియన్ సిరీస్ ను క్రియేట్ చేయడమే కాక మరిన్ని సీజన్లకు స్కోప్ ఇస్తూ చక్కని లీడ్ ఇచ్చారు. సౌత్ లో ఈ తరహా సిరీస్ లు తీయాలని షారుక్ ఖాన్ మొదలుకొని చాలా మంది ప్రయత్నించినప్పటికీ.. విజయం సాధించింది మాత్రం రాజ్ & డి.కె మాత్రమే.

టెక్నికల్ గా సంగీతం పరంగా కానీ, కెమెరా వర్క్ పరంగా కానీ ఏమాత్రం వేలెత్తి చూపలేని అద్భుతమైన ఔట్ పుట్ ఇచ్చారు. ముఖ్యంగా ఎడిటింగ్.. భలే రోమాంచితంగా ఎడిట్ చేశారు. ఒక్కో ఎపిసోడ్ 40 నుంచి 50 నిమిషాలు ఉన్నప్పటికీ.. ఎక్కడా బోర్ కొట్టలేదు. అందుకు ఎడిటర్ ను మెచ్చుకొని తీరాలి.

విశ్లేషణ: పరభాషా సిరీస్ లు చూసి, ఇండియా నుండి మరీ ముఖ్యంగా సౌత్ ఇండస్ట్రీ నుంచి ఈ తరహా సిరీస్ లు ఎందుకు రావు అని బాధపడేవారికి చక్కని సమాధానం “ది ఫ్యామిలీ మ్యాన్”. మనోజ్ బాజ్ పాయ్ పెర్ఫార్మెన్స్, సమంత గట్స్, రాజ్ & డి.కె ఇంటెన్స్ టేకింగ్-రైటింగ్ కోసం ఒకసారి తప్పకుండా చూడాల్సిన సిరీస్ “ది ఫ్యామిలీ మ్యాన్”. మూడో సీజన్ కు కూడా మంచి స్కోప్ ఇచ్చి ఎండ్ చేయడం వలన ప్రేక్షకులు తప్పకుండా వచ్చే సీజన్ కోసం వెయిట్ చేస్తారు.

రేటింగ్: 3/5

Click Here To Read In ENGLISH

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus