ఓ కుర్రాడికి సినిమా మీద ఉన్న ప్రేమ.. ఈ ఏడాది మన దేశం నుండి ఆస్కార్ బరిలో నిలిచిన విషయం తెలిసిందే. ఎందుకు ఎంపిక చేశారు, మిగిలిన సినిమాల్ని పక్కన పెట్టి మరీ ఎందుకు తీసుకున్నారు. దీని గురించి చర్చ ఇప్పుడు నడుస్తోంది. అయితే మరోవైపు ఆ సినిమాలో అంతగా స్పెషలేంటి అనే చర్చ కూడా నడుస్తోంది. ఇప్పుడు మనం ఆ గుజరాతీ సినిమా గురించి చూద్దాం. ఆ సినిమా కథేంటి, నేపథ్యమేంటి అనేది తెలుసుకుందాం.
95వ ఆస్కార్ పురస్కారాల కోసం ‘ఛల్లో షో’ ఎంపికైన విషయం తెలిసిందే. మన దేశం నుండి ‘ఆర్‌ఆర్‌ఆర్’, ‘ది కశ్మీర్ ఫైల్స్’ లాంటి 13 సినిమాలతో పోటీ పడి ఈ సినిమా విజేతగా నిలిచి ఆస్కార్‌కి వెళ్లింది. తన బాల్య జ్ఞాపకాలనే సినిమాగా మలిచారు దర్శకుడు పాన్ నళిన్. మాస్టర్ భవిన్ రబరి ప్రధాన పాత్రలో నటించాడు. ఈ సినిమా ‘ది లాస్ట్ షో’ పేరుతో అక్టోబరు 14న ఇంగ్లిష్ భాషలో విడుదల కానుంది.
‘ఛల్లో షో’ సినిమాను తొలిసారి 2021 జూన్‌లో ట్రిబెకా చిత్రోత్సవాల్లో ప్రదర్శించారు. స్పెయిన్‌లో జరిగిన ‘వల్లాడోలిడ్’ ఫిలిం ఫెస్టివల్‌లోనూ ప్రదర్శించగా… గోల్డెన్ స్పైక్ పురస్కారం అందుకుంది. దీంతోపాటు మరికొన్ని పురస్కారాలు కూడా వచ్చాయి. నళిన్ పాన్ గతంలో తీసిన ‘సంసార’, ‘వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్’, ‘యాంగ్రీ ఇండియన్ గాడెసెస్’ చిత్రాలు కూడా విమర్శకుల ప్రశంసలు అందుకోవడం గమనార్హం. ఇంతకీ ‘ఛల్లో షో’ కథేంటి అంటే.. గుజరాత్‌లోని చలాలా అనే పల్లెటూరులో ఈ సినిమా కథ సాగుతుంది.
ఆ ఊర్లో పుట్టి పెరిగిన సమయ్ అనే కుర్రాడికి థియేటర్ ప్రొజెక్టర్ ఆపరేటర్‌తో పరిచయం ఏర్పడుతుంది. థియేటర్‌కి వెళ్లి తరచూ ప్రొజెక్షన్ గదిలోకి వెళ్తుంటాడు. ప్రొజెక్టర్ నుండి వచ్చే కాంతి తెరపై బొమ్మగా మారడం చూసి.. అతనిలో మరింత ఆసక్తి కలుగుతుంది. అలా ఆ ప్రొజెక్షన్ బూత్‌లో కూర్చొని వేసవి మొత్తాన్ని గడిపేస్తాడు. దీంతో సమయ్‌కి సినిమాపై విపరీతమైన మమకారం పెరుగుతుంది. సినిమాని పిచ్చిగా ప్రేమిస్తాడు. దీంతో ఆ కుర్రాడి జీవితంలో ఎలాంటి మార్పులు వచ్చాయి, తన ఆసక్తిని ఎలా నెరవేర్చుకున్నాడు అనేదే కథ. ఇప్పుడు ఇదే కథ ఆస్కార్‌కి మన దేశం తరఫున వెళ్తోంది.
Most Recommended Video
శాకిని డాకిని సినిమా రివ్యూ & రేటింగ్!
నేను మీకు బాగా కావాల్సినవాడిని సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 6’ కంటెస్టెంట్ గీతు రాయల్ గురించి ఆసక్తికర విషయాలు..!