Krishanam Raju: ది రియల్ రెబల్‌ స్టార్..కృష్ణంరాజు ఎక్కడున్నా రెబలే!

  • September 11, 2022 / 08:22 AM IST

నిలువెత్తు కటౌట్‌.. నడుచుకుంటూ వస్తుంటే ఓ విగ్రహమే కదులుతున్నట్లు అనిపిస్తుంది. తెలుగు హీరోల్లో అలాంటి సౌష్టవం అప్పటి హీరోల్లో లేదు. అందుకే కృష్ణంరాజు అంటే అప్పట్లో స్పెషల్. డైలాగ్‌ డెలివరీలో ఓ చిన్న పాజ్‌ ఉండేది. మాస్‌ హీరోలు అంటే అలానే మాట్లాడాలి కొన్నేళ్లపాటు హీరోలు అనుకునేంతగా అలవాటు చేసేశారు కృష్ణంరాజు. అలాంటి ఆయన మనల్ని విడిచి వెళ్లిపోయారు. 56 ఏళ్ల పాటు మనల్ని అలరించిన రెబల్‌ స్టార్‌.. ఇప్పుడు స్వర్గపురిక పయనమయ్యారు. ఈ నేపథ్యంలో ఆయన గురించి ఓసారి చదువుకుందామా?

‘చిలకా గోరింక’ నుండి ‘రాధేశ్యామ్‌’ వరకు…

కృష్ణంరాజు అసలు పేరు ఉప్పలపాటి వెంకట కృష్ణంరాజు. 1940 జనవరి 20న పశ్చిమ గోదావరి జిల్లాలోని మొగల్తూరులో జన్మించారు. భార్య శ్యామలా దేవి. వీరికి ముగ్గురు కుమార్తెలు. 1966లో ‘చిలకా గోరింక’ చిత్రం ద్వారా తెరంగేట్రం చేశారు. ఆఖరిగా ఈ ఏడాది విడుదలైన ‘రాధేశ్యామ్‌’లో కనిపించారు. ఈ క్రమంలో 180కిపైగా చిత్రాల్లో నటించారు. 56 ఏళ్ల సుదీర్ఘ కెరీర్‌ ఆయన చేసిన పాత్రలే రెబల్‌ స్టార్‌ అనే పేరును తీసుకొచ్చాయి.

కత్తందుకో జానకీ…

ఆ పేరు ఆయనకు ఊరకనే ఇవ్వలేదు. అలా అని వచ్చాక ఆయన ఊరుకోలేదు. పేరుకు తగ్గట్టు రెబల్‌ సినిమాలే చేశారు. విభిన్నమైన పాత్రలతో నటుడిగాను, ఇండస్ట్రీ స్థాయిని పెంచే సినిమాలను నిర్మించి మెప్పించారు. ఆ రోజుల్లో ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణకు దీటుగా, పోటీగా కృష్ణంరాజు అదరగొట్టారు. పౌరుషానికి కేరాఫ్‌ అడ్రెస్‌ కృష్ణంరాజు అనేవారు ఆ రోజుల్లో. ‘కత్తందుకో జానకీ..’ డైలాగ్‌ గుర్తుందా? ఆ డైలాగ్‌ చెప్పింది కృష్ణంరాజే అని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.

పేరు తెచ్చిన సినిమాలు

ఐదున్నర దశాబ్దాలకుపైగా సాగిన ఆయన ‘బుద్ధిమంతుడు’, ‘మనుషులు మారాలి’, ‘పెళ్ళి కూతురు’, ‘మొహమ్మద్‌ బిన్‌ తుగ్లక్‌’, ‘హంతకులు దేవాంతకులు’, ‘నీతి నియమాలు’, ‘తల్లీ కొడుకులు’, ‘భక్త కన్నప్ప’, ‘తాండ్ర పాపారాయుడు’, ‘బొబ్బిలి బ్రహ్మన్న’, ‘రారాజు’, ‘త్రిశూలం’, ‘రంగూన్‌ రౌడి’, ‘మన ఊరి పాండవులు’, ‘కటకటాల రుద్రయ్య’, ‘సతీ సావిత్రి’, ‘పలనాటి పౌరుషం’ ‘తాతా మనవడు’, ‘టూ టౌన్‌ రౌడి’ లాంటి సినిమాలు ఆయనకు పేరు తీసుకొచ్చాయి.

రాష్ట్రపతి పురస్కారాలు

అప్పటి హీరోల్లాగానే కృష్ణంరాజు కేవలం సాంఘిక చిత్రాలకే పరిమితమవ్వలేదు. జానపద సినిమాల్లోనూ ఆయన తన నటనా కౌశలాన్ని ప్రదర్శించారు. ఇక నిర్మాతగా, నటుడిగా గోపీకృష్ణ మూవీస్‌ పతాకంపై ఆయన చేసిన ‘భక్త కన్నప్ప’, ‘తాండ్ర పాపరాయుడు’ ఇండస్ట్రీలో ట్రెండ్‌ సెట్టర్‌లుగా నిలిచాయి. అలా సినిమాల్లో రెబల్‌ అనిపించుకున్న కృష్ణంరాజు రాజకీయాల్లోకీ ప్రవేశించారు. కృష్ణంరాజుకు 1977లో ‘అమరదీపం’ సినిమాకు, 1978లో ‘మన ఊరి పాండవులు’ సినిమాకు ఆయనకు రాష్ట్రపతి పురస్కారాలు వచ్చాయి.

మరిన్ని పురస్కారాలు

‘అమరదీపం’ (1977), ‘బొబ్బలి బ్రహ్మన్న’ (1984) చిత్రాలకుగాను నంది అవార్డులు వచ్చాయి. ఉత్తమ సహాయ నటుడిగా 1994లె ‘జైలర్‌ గారి అబ్బాయి’ సినిమాకు అవార్డు వచ్చింది. ఫిలింఫేర్‌ నుండి.. ‘అమరదీపం’ (1977)కిగాను ఉత్తమ నటుడు, ‘ధర్మాత్ముడు’ (1983)కిగాను స్పెషల్‌ జ్యూరీ పురస్కారం, ‘బొబ్బిలి బ్రహ్మన్న’ (1984)కిగాను ఉత్తమ నటుడు పురస్కారం, ‘తాండ్రపాపారాయుడు’ (1986)కిగాను ఉత్తమ నటుడి పురస్కారం, 2006లో ఫిల్మ్‌ఫేర్‌ దక్షిణాది జీవితసాఫల్య పురస్కారం దక్కింది. 2014లో రఘుపతి వెంకయ్య పురస్కారం అందుకున్నారు. ఇవి కాకుండా ఇతర మరెన్నో పురస్కారాలు ఆయనకు దక్కాయి.

రాజకీయంలో ఇలా..

1991లో కాంగ్రెస్‌లో చేరిన కృష్ణంరాజు నర్సాపురం లోక్‌సభ నియోజకవర్గం నుండి పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత రాజకీయాలకు దూరమై సినిమాల్లోకి వచ్చేశారు. తిరిగి 1998లో బీజేపీ నుండి కాకినాడ లోక్‌ సభ స్థానానికి పోటీ చేసి గెలుపొందారు. 1999లో జరిగిన మధ్యంతర ఎన్నికల్లో బీజేపీ తరఫు నుండి నర్సాపురం లోక్‌సభ స్థానం నుండే గెలుపొందారు. ఎన్డీయే ప్రభుత్వంలో కేంద్ర మంత్రిగానూ పనిచేశారు. 2004 ఎన్నికల్లో అక్కడి నుండే పోటీచేసిన కృష్ణంరాజు ఓడిపోయారు. ఆ తర్వాత చిరంజీవి ప్రజారాజ్యం పార్టీలో చేరారు. రాజమండ్రి నుండి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత తిరిగి బీజేపీలోకి వచ్చేశారు. ఇటీవల ఆయనకు గవర్నర్ పదవి వస్తుందని వార్తలొచ్చినా.. జరగలేదు.

కృష్ణంరాజు సినిమాల్లోకి రాకముందు ‘ఆంధ్ర రత్న’ అనే పత్రికలో జర్నలిస్ట్‌గా చేశారు. ఆ సమయంలో ఉత్తమ ద్వితీయ ఫొటోగ్రాఫర్‌గా రాష్ట్ర స్థాయి పురస్కారం కూడా అందుకున్నారు. ఆయనకు కెమెరాలంటే బాగా ఇష్టమట. అందుకే ఇంట్లో కెమెరాల కలక్షన్‌ ఉంటుంది. మూవీ ఆర్టిస్ట్‌ అసోసియేషన్‌ (మా) క్రమశిక్షణా సంఘం అధ్యక్షుడిగా కృష్ణం రాజు చేశారు.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus