2018లో విడుదలైన “అరవింద సమేత వీరరాఘవ” తర్వాత సరిగ్గా ఆరేళ్ల తర్వాత జూనియర్ ఎన్టీఆర్ సోలో హీరోగా తెరకెక్కిన చిత్రం “దేవర” (Devara). “ఆర్ఆర్ఆర్” లాంటి బ్లాక్ బస్టర్ హిట్ అనంతరం తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో సెప్టెంబర్ 27న విడుదలకానున్న “దేవర”పై ఇటు తెలుగు రాష్ట్రాల్లో, అటు పాన్ ఇండియన్ లెవల్ లో భారీ అంచనాలున్నాయి. విడుదలైన మొదటి ట్రైలర్ కు మిశ్రమ స్పందన రావడంతో, ఇవాళ (సెప్టెంబర్ 22) కొత్త రిలీజ్ ట్రైలర్ ను విడుదల చేశారు. ఆ ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇదే ఊపులో సాయంత్రం జరిగే ప్రీరిలీజ్ ఈవెంట్లో తారక్ (Jr NTR) స్పీచ్, దర్శకుడు కొరటాల స్పీచ్ & జాన్వీ స్పీచ్ కోసం జనాలు చాలా ఆత్రంగా ఎదురుచూశారు. కట్ చేస్తే.. ప్రీరిలీజ్ ఈవెంట్ క్యాన్సిల్ అని తెలిసి నీరుగారిపోయారు.
తెలుగు రాష్ట్రాల నుండి మాత్రమే కాక కర్ణాటక నుండి కూడా వందల సంఖ్యలో అభిమానులు హైదరాబాద్ లోని నోవోటెల్ కు చేరుకున్నారు. సరిగ్గా సాయంత్రం 4.00 గంటలకల్లా నోవోటెల్ మొత్తం దద్దరిల్లిపోయింది. వి.ఐ.పి, ఎం.ఐ.పి, ఎం.ఎం.ఐ.పి, మీడియా గ్యాలరీ, సెలబ్రిటీ ఎంట్రీ అంటూ విభజించిన అన్ని ఎంట్రీలు 5.00 గంటల కల్లా కిక్కిరిసిపోయాయి. 5000 మంది సరిపోయే ఆడిటోరియం ఆల్రెడీ ఫిల్ అయిపోగా.. బయట ఓ 8 వేల మంది దాకా అభిమానులు వెయిట్ చేస్తున్నారు. అప్పుడు మొదలైంది అసలు రచ్చ.
Devara
ఈవెంట్ క్యాన్సిల్ అయ్యింది.. ఇళ్ళకి వెళ్లిపోండి: నోవోటెల్ స్టాఫ్
5.00 గంటల నుండి బయట నిలబడిన ఎన్టీఆర్ అభిమానులకు నోవోటెల్ సిబ్బంది మినీ మైక్ సెట్ లు పట్టుకొని “రద్దీ కారణంగా ఈవెంట్ క్యాన్సిల్ అయ్యింది, అందరూ వెనక్కి వెళ్లిపోండి” అని ప్రకటించడం మొదలెట్టారు. దాంతో కోపోద్రిక్తులైన ఎన్టీఆర్ అభిమానులు స్టాఫ్ మీద ఎగబడ్డారు.
కంట్రోల్ చేయడానికి ప్రయత్నిస్తే.. అద్దాలు పగలగొట్టారు
సాధారణంగా సినిమా థియేటర్ల దగ్గర షో మొదలవ్వడానికి ముందు అభిమానులు గేట్లు తోసుకురావడానికి ప్రయత్నిస్తారు. అక్కడంటే ఐరెన్ గేట్లు కాబట్టి వాళ్ల ఉత్సాహాన్ని తట్టుకోగలుగుతాయి. కానీ.. నోవోటెల్ లో ఉన్న గాజు అద్దాలు ఏమేరకు తట్టుకోగలవు చెప్పండి, అందుకే అభిమానులు కాస్త దూకగానే భళ్లున పగిలిపోయాయి.
గ్యాలరీలు మొత్తం అభిమానులే నిండిపోయారు
ఇంచుమించుగా స్టేజీ వరకు అభిమానులు వచ్చేశారు. ఆఖరికి స్టేజ్ మీదకు కూడా కొందరు అభిమానులు వచ్చేసి గోల చేయడం మొదలుపెట్టారు. దెబ్బకి బౌన్సర్లు కూడా మా వల్ల కాదు అంటూ బయటికి వచ్చేశారు. చివరికి పోలీసులు రంగంలోకి దిగి సెలబ్రిటీ గ్యాలరీ వరకు క్లియర్ చేయాల్సి వచ్చింది.
కోపంతో కుర్చీలు విరగ్గొట్టిన ఎన్టీఆర్ అభిమానులు
రాత్రి 8.00 అవుతున్నా ఈవెంట్ మొదలవ్వకపోవడంతో అప్పటికే నీరుగారిపోయి ఉన్న ఎన్టీఆర్ అభిమానులు కోపంతో కుర్చీలు విరగ్గొట్టడం మొదలెట్టారు. దాంతో నోవోటెల్ సంస్థ సెక్యూరిటీ రంగంలోకి దిగి ఫ్యాన్స్ అందరినీ బయటికి పంపడం మొదలెట్టారు.
బయట నుండే తిరిగి వెళ్లిపోయిన త్రివిక్రమ్ & నాగవంశీ
“దేవర” (Devara) ప్రీరిలీజ్ ఈవెంట్ కు ముఖ్య అతిథులుగా వచ్చిన దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ & తెలుగు రాష్ట్రాల డిస్ట్రిబ్యూషన్ హక్కులు కొనుక్కున్న నిర్మాత నాగవంశీ కనీసం వెన్యూలోకి వెళ్లడానికి కూడా వీలు లేకపోవడంతో.. వచ్చిన వోల్వో కారులోనే తిరిగివెళ్లిపోయారు.
శ్రేయాస్ మీడియా అత్యుత్సాహమే ముఖ్యకారణం
భారతదేశంలోనే నెం.1 ఈవెంట్ ఆర్గనైజర్స్ అని ప్రతి ఈవెంట్లో ఒకటికి పదిసార్లు చాటింపు వేసుకొనే శ్రేయాస్ మీడియా అత్యుత్సాహమే ఈవెంట్ క్యాన్సిల్ అవ్వడానికి ముఖ్యకారణమని తెలుస్తోంది. 5000 మంది మాత్రమే పట్టే కెపాసిటీ ఉన్న ఆడిటోరియంలో ఈవెంట్ చేయడం అనే ఆలోచనే పెద్ద మైనస్ అనుకుంటే.. కెపాసిటీకి మూడురెట్లు పాసులు కొట్టించి డిస్ట్రిబ్యూట్ చేయడం అనేది అసలు కారణం.