సినీ పరిశ్రమలోని అగ్ర దర్శకుల్లో ఒకరైన ఎస్.ఎస్. రాజమౌళి (S. S. Rajamouli) అనుకోని వివాదంలో చిక్కుకున్న విషయం తెలిసిందే. ఆయన స్నేహితుడిగా చెప్పుకునే శ్రీనివాసరావు చేసిన ఆరోపణలు ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. అయితే ఈ విషయంలో రాజమౌళి నుంచి ఇప్పటి వరకు ఎటువంటి స్పందన రాలేదు. సాధారణంగా ఇటువంటి ఆరోపణలు చేసినప్పుడు, పబ్లిక్ ఫిగర్స్ తక్షణమే స్పందించి క్లారిటీ ఇస్తారు. కానీ జక్కన్న మాత్రం పూర్తిగా మౌనం పాటించడం ఆసక్తికరంగా మారింది.
శ్రీనివాసరావు చేసిన ఆరోపణలు చిన్నవి కావు. తాను రాజమౌళి వల్ల తీవ్ర మానసిక ఒత్తిడికి గురయ్యానని, ఆయన కారణంగా తన జీవితం నాశనమైపోయిందని వీడియో ద్వారా చెప్పాడు. అంతే కాకుండా తన మరణానికి ఇదే కారణమని పేర్కొంటూ లేఖ కూడా విడుదల చేశాడు. దీని ఆధారంగా పోలీసులు సుమోటో కేసు నమోదు చేసి రాజమౌళికి లై డిటెక్టర్ టెస్ట్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఇది సినీ వర్గాల్లో పెద్ద సంచలనంగా మారింది.
ఇప్పటివరకు రాజమౌళి స్పందించకపోవడం మరో చర్చకు తెరలేపింది. ఆయన మాట చెప్పకుండానే ఈ వివాదం మసిపోవాలని అనుకుంటున్నారా? లేక దీనిని అనవసరంగా హైలైట్ చేయొద్దని కుటుంబ సభ్యులు, లాయర్లు సూచించారా? అనే ప్రశ్నలు బయటికొస్తున్నాయి. కొందరు రాజమౌళికి ఈ విషయం తెలియకపోవచ్చనే అనుకుంటున్నారు. కానీ సోషల్ మీడియా యుగంలో ఇది అసాధ్యమే. అందుకే రాజమౌళి ఈ ఆరోపణలను పెద్దగా పట్టించుకోవడం లేదని సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం ఆయన మహేష్ బాబుతో (Mahesh Babu) కలిసి SSMB29 సినిమాపై పూర్తిగా ఫోకస్ పెట్టారు.
ఈ సినిమాకు సంబంధించిన ప్రీ-ప్రొడక్షన్, షూటింగ్ పనులు వేగంగా జరుగుతున్నాయి. దీని మధ్యలో ఏ చిన్న వివాదం కూడా తన పనిని డిస్టర్బ్ చేయకూడదని భావించారని తెలుస్తోంది. ఇకపోతే, కుటుంబ సభ్యులూ ఇప్పటివరకు స్పందించలేదు. అంటే అంతా కలిసే మౌనం పాటించాలని నిర్ణయం తీసుకున్నట్లే. కొంతమంది మాత్రం రాజమౌళి కనీసం లీగల్ నోటీసైనా పంపితే బాగుండేదని అంటున్నారు. మరి జక్కన్న ఈ ఆరోపణలపై ఎప్పుడు స్పందిస్తారో చూడాలి.