సినిమా విడుదల తేదీ దగ్గరపడుతున్న కొద్దీ, ప్రమోషన్లు కూడా అదే స్థాయిలో ఉండాలి. కానీ మంచు విష్ణు (Manchu Vishnu) డ్రీమ్ ప్రాజెక్ట్ కన్నప్ప (Kannappa) విషయంలో ఇప్పటివరకు ఉన్న బజ్ అనుకున్న స్థాయికి చేరలేదనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. మహాశివుడి భక్తుడైన కన్నప్ప జీవితం ఆధారంగా రూపొందుతున్న ఈ పాన్ ఇండియా మూవీ ఇప్పటికే మోస్తరుగా ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది. కానీ పెద్ద సక్సెస్ కావాలంటే, మరింత విస్తృత స్థాయిలో ప్రచారం జరగాల్సిన అవసరం ఉంది.
ముఖేష్ కుమార్ దర్శకత్వంలో, మోహన్ బాబు (Mohan Babu) నిర్మాణంలో భారీ తారాగణంతో తెరకెక్కుతున్న ఈ సినిమాలో విష్ణుతో పాటు ప్రభాస్ (Prabhas) , అక్షయ్ కుమార్ (Akshay Kumar) , మోహన్ లాల్ (Mohanlal), కాజల్ అగర్వాల్ (Kajal Aggarwal), శివరాజ్ కుమార్ (Shiva Rajkumar), మధుబాల, శరత్ కుమార్ (R. Sarathkumar), బ్రహ్మానందం (Brahmanandam), బ్రహ్మాజీ (Brahmaji) తదితరులు గెస్ట్ రోల్స్ చేస్తున్నారు. ఈ కాస్టింగ్ ఇప్పటికే సినిమాపై అంచనాలను పెంచినా, వాటిని మరింత ఎక్కువ స్థాయిలో ఆడియన్స్ కు రీచ్ చేసే ప్రయత్నాలు కావాలి. ఇప్పటికే మేకర్స్ ప్రమోషన్లను ప్రారంభించారు.
ఇటీవల శ్రీకాళహస్తి ఆలయంలో శివరాత్రి సందర్భంగా టీజర్ ప్రదర్శించారు. ముంబైలో ప్రత్యేక ఈవెంట్ నిర్వహించి టీజర్ లాంచ్ చేశారు. కానీ ఇంకా ఈ స్థాయికి సరిపోయే హైప్ రాలేదని సినీ విశ్లేషకులు చెబుతున్నారు. విడుదలకు 45 రోజులు మాత్రమే ఉండటంతో, ఈ గ్యాప్ లో కచ్చితంగా పెద్ద స్థాయిలో ప్రమోషన్లు నిర్వహించాల్సిన అవసరం ఉంది. ప్రస్తుతం నార్త్ మార్కెట్ ను ఆకర్షించడం చాలా కీలకం. కన్నప్ప కథలో ఉన్న ఆధ్యాత్మికత, దేశవ్యాప్తంగా ఉన్న శైవ భక్తులను థియేటర్లకు రప్పించగలదు.
రీసెంట్ గా మహాకుంభమేళా జరిగిన నేపథ్యంలో, ఆ హైప్ ను ఉపయోగించుకుని హిందీ మార్కెట్ లో మరింతగా ప్రమోషన్ చేయాలని నెటిజన్లు సలహాలు కూడా ఇచ్చారు. అదే సమయంలో, కన్నప్ప స్టోరీ అందరికీ తెలిసిన కథ కావడంతో, ఈ వెర్షన్‌లో ప్రత్యేకత ఏమిటనేది మేకర్స్ స్పష్టంగా చెప్పాలి. రీసెంట్ గా విష్ణు ఓల్డ్ వెర్షన్ తో పోలిస్తే చాలా మార్పులు చేశాం అని చెప్పినప్పటికీ, వాటిని ప్రేక్షకులకు సమర్థవంతంగా చేరవేయాలి. మరి మేకర్స్ ఈసారి ప్రచారంలో కొత్త మార్గాలను ఎంచుకుంటారా? అన్నది చూడాలి.