ఆనాడు తోటి స్టార్ హీరోలందరితోనూ కలిసి ఎన్నో మల్టీస్టారర్ సినిమాల్లో నటించారు నందమూరి తారక రామారావు గారు. అక్కినేని నాగేశ్వర రావు, శోభన్ బాబు, కృష్ణ, కృష్ణంరాజు వంటి అప్పటి స్టార్ హీరోలందరితో కలిసి నటించారాయన. అంతేకాదు ఇందులో కొన్ని మల్టీ స్టారర్లకు ఆయన నిర్మాతగా కూడా వ్యవహరించడం విశేషం. ఇక ఇప్పటి రోజుల్లో మల్టీస్టారర్ ట్రెండ్ ను మొదలు పెట్టింది మాత్రం విక్టరీ వెంకటేష్ అనే చెప్పాలి.కమల్ హాసన్ తో ‘ఈనాడు’, మహేష్ బాబు తో ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’, రామ్ తో ‘మసాలా’, పవన్ కళ్యాణ్ తో ‘గోపాల గోపాల’, వరుణ్ తేజ్ తో ‘ఎఫ్2’,నాగ చైతన్య తో ‘వెంకీ మామ’ వంటి మల్టీస్టారర్ సినిమాలు చేశారు.
కానీ మనకి తెలియని విషయం ఏమిటంటే.. సీనియర్ ఎన్టీఆర్, వెంకటేష్ కాంబినేషన్లో ఓ మల్టీస్టారర్ రావాల్సి ఉందట. కానీ కొన్ని కారణాల వలన అది ఆగిపోయిందని తెలుస్తుంది. వివరాల్లోకి వెళితే.. బాలకృష్ణ-క్రిష్ కాంబినేషన్లో వచ్చిన ‘గౌతమిపుత్ర శాతకర్ణి’ సినిమా అందరికీ గుర్తుండే ఉంటుంది.నిజానికి ఈ చిత్రాన్ని మొదట సీనియర్ ఎన్టీఆర్, వెంకటేష్ లు కలిసి చేయాలనుకున్నారు. ఎన్టీఆర్ శాతకర్ణి పాత్రలో, వెంకటేష్ శాతకర్ణి కొడుకు పులమావి పాత్రలో నటించాలి అనుకున్నారు.
క్రిష్ ‘గౌతమిపుత్ర’ లో శాతకర్ణి విజయాలను మాత్రమే చూపించారు. కానీ ముందు అనుకున్న మల్టీస్టారర్ లో శాతకర్ణి విజయాలతో పాటు అతని కొడుకు పులమావి విజయాలను కూడా చూపించేలా కథని రెడీ చేయించారట పెద్దాయన(సీనియర్ ఎన్టీఆర్).కానీ ఆయన అనూహ్యంగా రాజకీయాల్లో బిజీగా మారడంతో ఈ ప్రాజెక్టు పట్టాలెక్కలేదని తెలుస్తుంది. అయితే వెంకీ నటించిన ‘కలిసుందాం రా’ సినిమాలో పెద్ద ఎన్టీఆర్ ను గ్రాఫిక్స్ లో చూపించిన సంగతి తెలిసిందే.