ఈ ఏడాది సంక్రాంతి కానుకగా విడుదలైన ‘హనుమాన్’ (Hanuman) చిత్రం పెద్ద బ్లాక్ బస్టర్ అయ్యింది. వరల్డ్ వైడ్ గా ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రూ.350 కోట్ల వరకు గ్రాస్ ను కలెక్ట్ చేసింది. ప్రశాంత్ వర్మ (Prasanth Varma) డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో తేజ సజ్జ (Teja Sajja) హీరో. క్లైమాక్స్ ఎపిసోడ్ బాగా హైలెట్ అయ్యింది. అలాగే సెకండ్ పార్ట్ ఉంటుందని లీడ్ కూడా ఇచ్చారు. ‘హనుమంతుడు కి ఇచ్చిన మాట విభీషణుడు నిలబెట్టుకున్నాడు’ అనేది ఫస్ట్ పార్ట్ కథాంశం అని, మరి ‘శ్రీరాముడికి ఇచ్చిన మాట హనుమంతుడు ఎలా నిరూపించుకున్నాడు’ అనేది సెకండ్ పార్ట్ కథాంశం అని క్లైమాక్స్ లో చెప్పారు.
‘జై హనుమాన్’ (Jai Hanuman) పేరుతో సెకండ్ పార్ట్ రూపొందనుంది. అయితే సెకండ్ పార్ట్ విషయంలో చాలా మార్పులు చోటు చేసుకున్నాయి. కథ ప్రకారం రెండో పార్ట్ లో హీరో తేజ సజ్జ కాదు..! ‘కాంతార’ హీరో రిషబ్ శెట్టిని (Rishab Shetty) హనుమంతుడి పాత్రలో పెట్టారు. రెండు రోజుల క్రితం అధికారిక ప్రకటన కూడా వచ్చింది. అయితే ఫస్ట్ పార్ట్ ను అంటే ‘హనుమాన్’ ని ‘ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్’ అధినేత నిరంజన్ రెడ్డి నిర్మించారు. కానీ ‘జై హనుమాన్’ ని ‘మైత్రి’ సంస్థ సోలోగా నిర్మించబోతోంది.
ఇలాంటి క్రేజీ ప్రాజెక్ట్ ని సాధారణంగా ఏ నిర్మాత కూడా వదులుకోరు. మరి ‘హనుమాన్’ నిర్మాత నిరంజన్ రెడ్డి (K. Niranjan Reddy) ఎందుకు వదిలేసుకున్నారు? ‘మైత్రి’ సంస్థ అధికారికంగా ప్రకటించినా ఎందుకు సైలెంట్ గా ఉన్నారు? అనే అంశాల పై ఇప్పుడు చర్చలు మొదలయ్యాయి. ‘హనుమాన్’ చిత్రం షూటింగ్ టైంలో ‘బడ్జెట్ శృతిమిస్తుంది’ అనే అంశంపై దర్శకుడు ప్రశాంత్ వర్మకి, నిరంజన్ రెడ్డికి మధ్య ‘కొంత గ్యాప్ ఏర్పడింది’ అనే వాదన ఉంది. వాస్తవానికి నిరంజన్ రెడ్డి తన స్థాయికి మించే ఆ సినిమాకి బడ్జెట్ ఖర్చు పెట్టారు.
అలాంటప్పుడు సెకండ్ పార్ట్ ను ఎందుకు వదులుకున్నారు. ‘డబుల్ ఇస్మార్ట్’ (Double Ismart) తో భారీ నష్టాలు రావడం వల్ల, సాయి ధరమ్ తేజ్ (Sai Dharam Tej) తో వంద కోట్ల ప్రాజెక్టు సెట్ చేసుకోవడం వల్ల.. ‘జై హనుమాన్’ నిర్మాణానికి దూరంగా ఉన్నారా? లేక అతనిపై ఎవరైనా ఒత్తిడి తీసుకొని ప్రాజెక్టు నుండి తప్పించారా? అదీ కాదు.. ఎంతో కొంత మైత్రి వాళ్ళు అతనికి ఇచ్చి.. తప్పుకోమన్నారా? అనేవి మిలియన్ డాలర్ల ప్రశ్నలు.