“మహానటి, సీతారామం(Sita Ramam) ” తర్వాత తెలుగులో దుల్కర్ సల్మాన్ (Dulquer Salmaan) నటించిన తాజా చిత్రం “లక్కీ భాస్కర్” (Lucky Baskhar). వెంకీ అట్లూరి (Venky Atluri) దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని నాగవంశీ (Suryadevara Naga Vamsi ) నిర్మించగా.. విడుదలైన ట్రైలర్ సినిమాపై మంచి అంచనాలు నమోదయ్యేలా చేసింది. మరి సినిమా ఆ అంచనాలను అందుకోగలిగిందా లేదా అనేది చూద్దాం..!!
కథ: నెలకి 19,500 జీతం వచ్చే బ్యాంక్ మేనేజర్ జాబ్ కు రిజైన్ చేసి, హ్యాపీగా ముంబై బీచ్ లో జాగింగ్ చేసుకుని ఇంటికి వెళ్తున్న భాస్కర్ (దుల్కర్ సల్మాన్)ను సిబిఐ పోలీసులు ప్రశ్నించడానికి అదుపులోని తీసుకొని అతడు రిజైన్ చేసిన మగధ బ్యాంక్ కు తీసుకొస్తారు. అతడి ఎకౌంట్ చెక్ చేయగా.. అక్షరాల 100 కోట్లకు పైగా సొమ్ము అతడి ఖాతాలో ఉన్నట్లుగా గుర్తిస్తారు.
అసలు ఓ సాధారణ అసిస్టెంట్ జనరల్ మేనేజర్ అయిన భాస్కర్ ఖాతాలో 100 కోట్లు ఎలా ఉన్నాయి? ఆ డబ్బు సంపాదించడం కోసం భాస్కర్ ఏం చేశాడు? ఆ పనుల కారణంగా అతడు ఎలాంటి ఇబ్బందులు ఫేస్ చేయాల్సి వచ్చింది? వంటి ఆశక్రికరమైన ప్రశ్నలకు సమాధానం “లక్కీ భాస్కర్” ప్రయాణం.
నటీనటుల పనితీరు: దుల్కర్ ఈ తరహా పాత్రల్లో భలే ఒదిగిపోతాడు. కథ మొత్తం 80ల్లో జరుగుతుంది, ఆ మేరకు తన లుక్ ను, బాడీ లాంగ్వేజ్ & మ్యానరిజమ్స్ ను దుల్కర్ మలుచుకున్న తీరు భాస్కర్ పాత్రతో ప్రేక్షకులు ప్రయాణించేలా చేస్తుంది. ముఖ్యంగా.. నిస్సహాయత మరియు డబ్బు పొగరు వంటి ఎమోషన్స్ ను అతడు పండించిన విధానం ప్రశంసనీయం.
మీనాక్షి చౌదరి (Meenakshi Chaudhary) సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చాక పడిన బెస్ట్ రోల్ ఇదే అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఇప్పటివరకు ఆమెను ఓ గ్లామర్ డాల్ లేదా సైడ్ క్యారెక్టర్ లా ట్రీట్ చేయడం వల్ల ఆమె యాక్టింగ్ టాలెంట్ ఏమిటి అనేది ఎవరికీ తెలియలేదు. “అవుట్ ఆఫ్ లవ్” అనే వెబ్ సిరీస్ లో మీనాక్షి నటన చాలా మెచ్యూర్డ్ గా ఉంటుంది. ఆ సిరీస్ తర్వాత ఆమె నటిగా ఆకట్టుకున్న పాత్ర ఈ సినిమాలో సుమతి అనే చెప్పాలి.
ఈ ఇద్దరి తర్వాత తన నటన మరియు స్క్రీన్ ప్రెజన్స్ తో విశేషంగా ఆకట్టుకున్న నటుడు శ్రీనాథ్ మాగంటి (Srinath Maganti). “హిట్” (HIT: The First Case) తర్వాత చాలా మంచి క్యారెక్టర్ దొరికింది. దొరికిన అవకాశాన్ని అద్భుతంగా సద్వినియోగపరుచుకున్నాడు. రాజ్ కుమార్ కసిరెడ్డి, సాయికుమార్ (Sai Kumar), సచిన్ కేడ్కర్ (Sachin Khedekar ), టీను ఆనంద్, రాంకీ (Ramki ) సినిమాను రక్తికట్టించడంలో కీలకపాత్ర పోషించారు.
సాంకేతికవర్గం పనితీరు: దర్శకుడు వెంకీ అట్లూరి సక్సెస్ రేట్ ఎక్కువ అయినప్పటికీ.. కథ-కథనం విషయంలో మాత్రం ఎప్పుడూ మొట్టికాయలు తింటూనే వచ్చాడు. కానీ.. “లక్కీ భాస్కర్” విషయంలో మాత్రం ఒక రచయితగా ఆశ్చర్యపరిచాడు. సినిమా మొత్తంలో ఒక్క అనవసరమైన పాత్ర, సన్నివేశం, సందర్భం, సంభాషణ లేదు. చాలా క్లిష్టమైన బ్యాంకింగ్ సెక్టార్ లోని లొసుగులను సగటు ప్రేక్షకులు అర్థం చేసుకొనేలా సులువైన విధంగా వివరించిన విధానం బాగుంది. అలాగని ఇష్టం వచ్చినట్లు సినిమాటిక్ లిబర్టీస్ తీసుకోకుండా, ఎక్కడవరకు తీసుకోవాలే అక్కడివరకే పరిమితం చేశాడు.
అన్నిటికంటే ముఖ్యంగా.. భాస్కర్ పాత్రతో ఫోర్త్ వాల్ బ్రేక్ చేస్తూ ఎప్పటికప్పుడు ఆడియన్స్ ను కథలో లీనమై, పాత్రలతో ట్రావెల్ అయ్యేలా చేసిన విధానం ప్రశంసార్హం. ఒక దర్శకుడిగా, రచయితగా వెంకీ అట్లూరి “లక్కీ భాస్కర్”తో 100% మార్కులు సంపాదించాడు అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఇప్పటివరకు వెంకీ అట్లూరిని “తొలిప్రేమ” (Tholi Prema) దర్శకుడిగా గుర్తించిన ప్రేక్షకులు ఇప్పటినుండి “లక్కీ భాస్కర్” డైరెక్టర్ గా గుర్తిస్తారు. ఈ సినిమాతో అతడు క్రియేట్ చేసే ఇంపాక్ట్ అలాంటిది.
వెంకీ అట్లూరి తర్వాత సినిమాకి పూర్తి న్యాయం చేసింది సంగీత దర్శకుడు జీవీ ప్రకాష్ (G. V. Prakash Kumar) . “లక్కీ భాస్కర్” టైటిల్ సాంగ్ ఎంత క్యాచీగా ఉందో, నేపథ్య సంగీతం కూడా అదే స్థాయిలో ఉంది. సన్నివేశంలోని మూడ్ & ఎలివేషన్ కు తగ్గట్లుగా నేపథ్య సంగీతం అందించి తన సత్తా చాటుకొని “లక్కీ భాస్కర్” విజయంలో కీలకపాత్ర పోషించాడు. నవీన్ నూలి (Naveen Nooli) ఎడిటింగ్ టెక్నిక్స్ ఈ సినిమాకి ప్రత్యేక ఆకర్షణ. చాలా కచ్చితత్వంతో చేసిన కూర్పు ఆడియన్స్ కు ఎక్కడా బోర్ కొట్టకుండా చేసింది.
ప్రొడక్షన్ డిజైన్, ఆర్ట్ వర్క్ & సీజీ టీమ్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. 80ల కాలం నాటి పరిసరాలను, పరిస్థితిలను రీక్రియేట్ చేసి, ఆడియన్స్ ను ఆ ప్రపంచంలోకి తీసుకెళ్లడంలో ఈ బృందాలు పోషించిన పాత్రను తప్పకుండా మెచ్చుకోవాలి. నిర్మాతలు కంటెంట్ ను నమ్మి ఖర్చుకి వెనుకాడకుండా దర్శకుడిని సపోర్ట్ చేసిన విధానం కూడా హర్షణీయం.
విశ్లేషణ: షార్ప్ రైటింగ్ & కేర్ ఫుల్ ఎగ్జిక్యూషన్ ను చాలా అరుదుగా చూస్తుంటాం. ప్రతి ఒక్క టెక్నికాలిటీ ఒకదాన్ని ఒకటి కాంప్లిమెంట్ చేసుకుంటూ సినిమాలో ప్రేక్షకుల్ని లీనం చేయడం అనేది “లక్కీ భాస్కర్” విషయంలో జరిగిన మెచ్చుకోదగిన విషయం. వెంకీ అట్లూరి రాత-తీత, దుల్కర్ నట ప్రతిభ, జీవి ప్రకాష్ కుమార్ సంగీతం “లక్కీ భాస్కర్”ను తప్పకుండా థియేటర్లలో చూడాల్సిన సినిమాగా మలిచాయి.
ఫోకస్ పాయింట్: భాస్కరుడి చోర పర్వం భలేగుంది!
రేటింగ్: 3.5/5