సినీ ఇండస్ట్రీలో ఎంత పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నా.. కోట్లు వెనకేసుకున్నా.. కెరీర్ ముగిసేసరికి చేతిలో చిల్లిగవ్వ లేని వాళ్ళు చాలా మందే ఉన్నారు. వీరిలో ముఖ్యంగా కమెడియన్ లు ఉండడం షాక్ కు గురిచేసే అంశం. ఇదిలా ఉండగా..గతంలో స్టార్ కమెడియన్ గా ఓ వెలుగు వెలిగిన సుధాకర్ గురించి ప్రత్యేక పరిచయమవసరం లేదు. 1959, మే 18న జన్మించిన సుధాకర్.. సినిమాల పై ఉండే ఇష్టంతో మద్రాస్(చెన్నై) వెళ్లాడు. ఆ సమయంలో మన మెగాస్టార్ చిరంజీవి, హరిప్రసాద్, నారాయణరావులతో కలిసి ఒకే గదిలో ఉండేవాడు సుధాకర్.ఈయన మనకు కమెడియన్ గానే తెలుసు.
కానీ ఇతను హీరోగా తమిళంలో 45 సినిమాల వరకూ చేసాడు. అప్పటి స్టార్ హీరోయిన్ రాధికతో కూడా 18 సినిమాల్లో నటించాడు సుధాకర్. అయితే కొన్నాళ్ళకి తమిళ ఇండస్ట్రీలో చోటుచేసుకున్న మార్పుల వల్ల తమిళ ఇండస్ట్రీ నుండీ బయటకి వచ్చేసి తెలుగులో నెగిటివ్ రోల్స్, మరియు కామెడీ పాత్రలు చేస్తూ సెటిల్ అయ్యాడు. సినిమాల ద్వారా భారీగా సంపాదించిన సుధాకర్, తన మిత్రుడు హరిప్రసాద్ తో కలిసి చిరంజీవితో ‘యముడికి మొగుడు’ అనే చిత్రాన్ని నిర్మించాడు.అది హిట్ అయ్యి మంచి లాభాలు రావడంతో.. మరికొన్ని సినిమాలను కూడా ఆయన నిర్మించాడు.అయితే ఎవ్వరూ ఊహించని విధంగా 2010, జూన్ 29న అనారోగ్యం పాలయ్యాడు సుధాకర్.
దాంతో అతన్ని ఆస్పత్రిలో జాయిన్ చెయ్యగా… కోమాలోకి వెళ్లిపోయాడు సుధాకర్. 2015లో కోలుకున్న సుధాకర్ పలు ఇంటర్వ్యూల్లో కూడా పాల్గొన్నాడు. అయితే కొంతమంది వల్ల ఈయన చాలా ఆస్తి పోగొట్టుకున్నట్టు కూడా వార్తలు వచ్చాయి. అది ఎలా అన్నది బయటకి రాలేదు. ఇక సుధాకర్ కోమాలో ఉన్నప్పుడు చిరంజీవి,నారాయణ రావు వంటి వారు తప్ప ఎవ్వరూ పట్టించుకోలేదట. ఆస్తి పోగొట్టుకోవడం వల్లనే సుధాకర్ కోమాలోకి వెళ్లిపోయాడని కొందరు చెబుతుంటారు.