ప్రముఖ సంగీత దర్శకుడు ఎ.ఆర్.రెహమాన్ (A.R.Rahman) ఆరోగ్యం గురించి ఆదివారం పెద్ద ఎత్తున చర్చ జరిగింది. దానికి కారణం ఆయన ఆదివారం ఉదయం చెన్నై గ్రీమ్స్ రోడ్డులోని అపోలో ఆస్పత్రికి రావడమే. ఆయన అస్వస్థతకు గురయ్యారని కొందరు, అనారోగ్యం పాలయ్యారని మరికొందరు సండే సమాచారం వండేశారు. దీంతో రెహమాన్‌కి ఏమైంది అనే చర్చలు పెద్ద ఎత్తున జరిగాయి. అయితే కాసేపటికి క్లారిటీ వచ్చేసింది. లండన్ పర్యటన ముగించుకుని శనివారం రాత్రి చెన్నైకి చేరుకున్నారు ఏఆర్ రెహమాన్.
మరుసటి రోజు అంటే ఆదివారం ఉదయానికి ఆస్పత్రిలో చేరడంతో ఏమైందా అనే ఆందోళన అభిమానుల్లో కలిగింది. విషయం తెలుసుకున్న రెహమాన్ కుమారుడు, కుమార్తె, సోదరి ఆస్పత్రికి వచ్చారు. దీంతో ఆ ప్రశ్నల తాకిడి మరింత ఎక్కువైంది. అయితే కాసేపటికి కుటుంబ సభ్యులు బయటకు వచ్చి మాట్లాడటంతో క్లియర్ అయింది. రెహమాన్ సోదరి ఫాతిమా మీడియాకు వివరాలు వెల్లడించారు. వరుస ప్రయాణాలతో రెహమాన్ (Ar Rahman) రెస్ట్‌లెస్‌గా ఫీల్ అయ్యారని, అందుకే వైద్య పరీక్షలు చేయించుకున్నారని చెప్పుకొచ్చారు.
ఆయన ఆరోగ్యం బాగానే ఉందని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కోరారు. అయితే ఆయన డీహైడ్రేషన్ కారణంగా ఆస్పత్రిలో చేరారని, పరీక్షలు తర్వాత డిశ్చార్జయ్యారని అపోలో ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ ఫోన్ ద్వారా ఆస్పత్రి వర్గాలను సంప్రదించి రెహమాన్ ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకున్నారు. కాసేపటికి తన తండ్రి ఆరోగ్యంగా ఉన్నారని రెహమాన్ కుమారుడు అమీన్ ఓ ప్రకటన విడుదల చేశారు.
దీంతో ఆల్ వెల్ అని అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. రెహమాన్ సినిమాల సంగతి చూస్తే ప్రస్తుతం రామ్ చరణ్ (Ram Charan) – జాన్వీ కపూర్ (Janhvi Kapoor) – బుచ్చిబాబు (Buchi Babu Sana) కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న సినిమా చేస్తున్నారు. అది కాకుండా ‘లాహోర్ 1947’, ‘థగ్ లైఫ్’, ‘తేరే ఇష్క్ మే’, ‘రామాయణ’, ‘మూన్ వాక్’, ‘జీనీ’ తదితర చిత్రాలకు సంగీతం అందిస్తున్నారు. వీటితోపాటు ఓ టీవీ సిరీస్ కూడా ఉంది.