తెలుగు సినిమా ప్రేక్షకులు గత కొన్ని రోజులుగా ఆందోళన చెందుతున్న రోజు వచ్చేసింది.. వారి మీద పెద్ద పిడుగు వేసి వెళ్లిపోయింది. అదే సినిమా థియేటర్ల బంద్. అవును గత కొన్ని రోజులుగా వస్తున్న పుకార్లకు తగ్గట్టుగానే సింగిల్ థియేటర్ల (Theaters) యాజమాన్యాలు టాలీవుడ్‌పై పిడుగు వేశాయి. అద్దె తరహాలో సినిమాలు వేయడం మా వల్ల కాదని, పర్సెంటేజీ ఇవ్వాల్సిందే అని తేల్చి చెప్పేశాయి. లేకపోతే జూన్ 1 నుంచి సినిమా థియేటర్ల బంద్ నిర్వహిస్తామని స్పష్టం చేసేశాయి.
ఆదివారం జరిగిన సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. ఈ సమావేశంలో దిల్ రాజు (Dil Raju), సురేష్ బాబుతో (Suresh Babu) సహా 60 మందికి పైగా పంపిణీదారులు పాల్గొన్నారని టాక్. అద్దె ప్రాతిపదికన సినిమాల్ని ప్రదర్శిస్తుండడంతో తమకు ఆదాయం సరిపోవడం లేదని గత కొన్ని రోజులుగా థియేటర్ల (Theaters) యాజమాన్యాలు చెబుతున్న విషయం తెలిసిందే. మల్టీప్లెక్స్ తరహాలో వసూళ్లలో పర్సెంటేజీ విధానాన్ని అమలు చేయాలని వారు కోరుతూ వస్తున్నారు. ఇప్పుడు ఫిలిం ఛాంబర్‌తో జరిగిన సమావేశంలో ఈ మేరకు తమ వాయిస్‌ను గట్టిగా వినిపించారని తెలుస్తోంది.
దీనిపై నిర్ణయం తీసుకోకపోతే జూన్ 1 నుంచి థియేటర్లని బంద్ చేయాలనే నిర్ణయానికి వచ్చినట్టు చెబుతున్నారు. తెలుగు చలన చిత్ర వాణిజ్య మండలిలో ఆదివారం ఎగ్జిబిటర్ల సమావేశం జరిగింది. తెలుగు రాష్ట్రాల్లోని థియేటర్ల యజమానులతోపాటు, సొంత థియేటర్లు ఉన్న సినీ ప్రముఖులు కూడా ఇందులో పాల్గొన్నారని భోగట్టా. ఈ డిమాండ్‌పై వెంటనే నిర్ణయం తీసుకునేలా నిర్మాతలకి లేఖ రాయాలని ఛాంబర్‌ను ఎగ్జిబిటర్లు కోరారని చెబుతున్నారు.
అయితే పర్సెంటేజీ విధానంతో తాము నష్టపోవాల్సి వస్తుందని నిర్మాతలు, పంపిణీదారులు ప్రస్తావించినట్లు తెలుస్తోంది. అయితే జూన్‌లో పెద్ద సినిమాలు వరుస కట్టిన నేపథ్యంలో ఎగ్జిబిటర్ల బంద్ నిర్ణయం ఆందోళన కలిగిస్తోంది. వచ్చే నెలలో కమల్ హాసన్ (Kamal Haasan) ‘థగ్ లైఫ్’(Thug Life), పవన్ కల్యాణ్ (Pawan Kalyan) ‘హరి హర వీరమల్లు’(Hari Hara Veera Mallu) , మంచు విష్ణు (Manchu Vishnu) ‘కన్నప్ప’ (Kannappa) , ధనుష్ (Dhanush) – నాగార్జున(Nagarjuna) ‘కుబేర’ (Kubera) లాంటి సినిమాలు ఉన్నాయి కాబట్టి ఈ విషయంలో నిర్ణయం త్వరగానే తీసుకుంటారనిపిస్తోంది.